Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్‌ జంట

ఒడిశాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన రామానంద పాసవాన్‌ (15) అనే బాలుడు, నేపాల్‌ నుంచి ఆ అబ్బాయి ఆచూకీ కోసం పరుగున తరలివచ్చిన తల్లిదండ్రులు ఓ టీవీ ఛానెల్‌ దృశ్యాల ఆధారంగా పరస్పరం కలుసుకోగలిగారు.

Updated : 08 Jun 2023 09:15 IST

కటక్‌: ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన రామానంద పాసవాన్‌ (15) అనే బాలుడు, నేపాల్‌ నుంచి ఆ అబ్బాయి ఆచూకీ కోసం పరుగున తరలివచ్చిన తల్లిదండ్రులు ఓ టీవీ ఛానెల్‌ దృశ్యాల ఆధారంగా పరస్పరం కలుసుకోగలిగారు. తనయుడి కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఆ జంటను ఓ టీవీ ఛానల్‌ విలేకరి గుర్తించి ప్రత్యక్ష ప్రసారంలో వారి కష్టాలను చూపించారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు తన గదిలో అదే సమయంలో ఆ టీవీ ఛానల్‌ చూస్తూ వెంటనే అక్కడి వైద్యవర్గాలను అప్రమత్తం చేశాడు. వారు టీవీ ఛానల్‌ వర్గాలతో మాట్లాడి, తల్లిదండ్రులను, వారి అబ్బాయిని ఒక్కటి చేశారు. కోరమండల్‌లో ప్రయాణించిన ముగ్గురు బంధువులు ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని, తమ కుమారుడొక్కడు అదృష్టవశాత్తూ బయటపడ్డాడని రామానంద తండ్రి హరి పాసవాన్‌ తెలిపారు.

సిగ్నల్‌ లోపం కాదంటున్న అధికారి

సిగ్నలింగ్‌ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని రైల్వేశాఖ ‘సంయుక్త దర్యాప్తు నివేదిక’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బృందంలో ఒకరైన సిగ్నల్‌-టెలికమ్యూనికేషన్స్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఏకే మహంత మాత్రం మిగిలిన నలుగురి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ‘‘17-ఏ పాయింటు రివర్స్‌ కండిషన్‌లో సెట్‌చేసి ఉందంటే నేను అంగీకరించను. డేటాలాగర్‌ ప్రకారం ఈ పాయింట్‌ ‘నార్మల్‌’లోనే ఉందని మా విభాగం పరిశీలనలో తేలింది. రైలు పట్టాలు తప్పిన తర్వాత ఈ పాయింట్‌ ‘రివర్స్‌’లోకి మారిపోయి ఉంటుంది’ అని మహంత నివేదికలో అభిప్రాయపడ్డారు.

‘చావు’ తెలివి చూపిన  భార్యపై భర్త ఫిర్యాదు

ఘోర రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెప్పి పరిహారం పొందేందుకు అతి తెలివి ప్రదర్శించిన మహిళ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ.. దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తుల ఫొటోలు ఉంచిన ప్రదేశంలో ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతడే తన భర్త అని చెప్పింది. పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా పరిహారం కోసం ఇలా వ్యవహరించినట్లు అంగీకరించడంతో హెచ్చరించి విడిచిపెట్టారు. గీతాంజలి తీరు ఆమె భర్త బిజయ్‌ దత్తాకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమెపై మానియాబందా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బ్రిటన్‌ పార్లమెంటు నివాళి

మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లడంపై బ్రిటన్‌ పార్లమెంటు సంతాపం వ్యక్తంచేసింది. భారత సంతతికి చెందిన విపక్ష నేత వీరేంద్రశర్మ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ స్పందించి, మృతులకు నివాళులర్పించింది. ఒడిశా ప్రభుత్వానికి, కేంద్ర సర్కారుకు సంతాప సందేశాలు పంపించింది. రైల్వేసిబ్బంది, అత్యవసర సేవల విభాగాలు, స్థానికులు అందించిన సేవల్ని కొనియాడింది.

నిజాలు వెలుగుచూడకుండా ప్రభుత్వ యత్నం: మమత

కోరమండల్‌ రైలు ప్రమాదం వెనుక నిజాలు వెలుగుచూడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో జరిగినట్లే ఇక్కడా కొన్ని ఆధారాలను ఇప్పటికే మాయం చేశారని చెప్పారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా నిలిచిన ఈ ప్రమాదంలో వాస్తవాలను తెలుసుకోవాలని మృతుల కుటుంబాలవారు భావిస్తుంటే దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. బాలేశ్వర్‌ ప్రమాదంలో చనిపోయిన బెంగాలీ ప్రయాణికుల కుటుంబాలకు చెక్కులు, ఉద్యోగ నియామకపత్రాలు అందించేందుకు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రమాద కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని, మంత్రిపై కేసు పెట్టాలి: కాంగ్రెస్‌

బాలేశ్వర్‌ రైలు ప్రమాద దుర్ఘటనలో కేంద్రం నిర్లక్ష్యం హిమాలయాలంత ఎత్తున కనిపిస్తోందనీ, దీనికిగానూ ప్రధాని నరేంద్రమోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లపై సీబీఐ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ప్రమాద స్థలంలో రైల్వేమంత్రి నాటకీయంగా వ్యవహరించారని, దానికిగానూ ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజోయ్‌కుమార్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వ్యంగ్యంగా అన్నారు. ప్రమాదానికి కారకులెవరో తేల్చినప్పుడే మృతుల కుటుంబాలకు న్యాయం జరిగినట్లవుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని