ఆగని రైలు ప్రమాద ఘంటికలు

వేర్వేరు రైల్వేజోన్ల పరిధిలో రైలుప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. అస్సాం, మధ్యప్రదేశ్‌లలో గూడ్సురైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురయ్యాయి.

Published : 08 Jun 2023 04:56 IST

ఝార్ఖండ్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
అస్సాం, మధ్యప్రదేశ్‌లలో పట్టాలు తప్పిన గూడ్సురైళ్లు

గువాహటి, జబల్పుర్‌, రాంచీ: వేర్వేరు రైల్వేజోన్ల పరిధిలో రైలుప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. అస్సాం, మధ్యప్రదేశ్‌లలో గూడ్సురైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురయ్యాయి. అస్సాంలోని కామ్‌రూప్‌ జిల్లాలో సింగ్రా వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన 20 వ్యాగన్లు బుధవారం పట్టాలు తప్పాయి. మొత్తం 60 వ్యాగన్లు ఈ రైల్లో ఉన్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఆ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు యథావిధిగా నడిచినా కొన్ని ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో ఒక గూడ్సురైలుకు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు మంగళవారం రాత్రి పట్టాలు తప్పాయి. భిటోనీ రైల్వేస్టేషన్‌ సమీపంలో చమురు డిపో సైడింగ్‌ లైన్లో గూడ్సు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దెబ్బతిన్న మార్గాన్ని బుధవారం పునరుద్ధరించారు. ప్రధాన మార్గంలో రైళ్లకు ఎలాంటి అంతరాయం వాటిల్లలేదు.

పట్టాల వద్దకు దూసుకొచ్చిన ట్రాక్టరు

ఝార్ఖండ్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కొత్తదిల్లీ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న రైలు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లా భోజూడీహ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద లెవెల్‌క్రాసింగ్‌ గేటును దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసుకుంటున్న రైల్వేగేటును ఢీకొడుతూ ఈ ట్రాక్టరు ఆ గేటుకు పట్టాలకు మధ్య ఆగిపోయింది. అతి సమీపం నుంచి దీనిని గమనించిన రైలు డ్రైవరు (లోకోపైలట్‌) సకాలంలో ఆకస్మిక బ్రేకు వేసి రైలును నిలిపేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆగ్నేయ రైల్వేలోని ఆడ్రా డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ మనీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటనతో రైలు ముప్పావుగంటసేపు ఆలస్యమైంది. ట్రాక్టరును స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవరుపై పోలీసు స్టేషన్లో కేసుపెట్టారు. గేట్‌మేన్‌ను సస్పెండ్‌ చేశారు. ఒడిశా రైలు దుర్ఘటన నేపథ్యంలో ఇటు ప్రయాణికులు, అటు రైల్వే అధికారులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు.

పాంటోగ్రాఫ్‌ విరగడంతో..

రైలుమార్గాల పైన ఉండే విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తును రైలింజన్‌కు అందించే పాంటోగ్రాఫ్‌ విరిగిపోవడంతో హోవ్‌డా-ధన్‌బాద్‌ కోల్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం సాయంత్రం పశ్చిమబెంగాల్‌లో నిలిచిపోయింది. దీనికి మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరా జరిగే ఏర్పాట్లు పూర్తయ్యేసరికి గంటన్నర సమయం పట్టింది. ఈలోగా రైళ్లను ఇతర మార్గాల్లో పంపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని