సంక్షిప్త వార్తలు (18)

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఖరీఫ్‌ పంట కనీస మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే విధంగా లేవని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆరోపించారు.

Updated : 09 Jun 2023 05:48 IST

క్విట్‌ ఇండియా డే రోజున దేశవ్యాప్త నిరసనలు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఖరీఫ్‌ పంట కనీస మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే విధంగా లేవని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆరోపించారు. ఇందుకు నిరసనగా క్విట్‌ ఇండియా డే అయిన ఆగస్టు 8న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడి ఏపీ-తెలంగాణభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు.


మణిపుర్‌ నిరాశ్రయులకు రూ.101 కోట్ల ప్యాకేజీ
కేంద్రం ఆమోదం తెలిపిందన్న రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్‌సింగ్‌

ఇంఫాల్‌: మణిపుర్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు రూ.101.75 కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్‌సింగ్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. మణిపుర్‌లో పరిస్థితులు ప్రస్తుతం ప్రశాంతంగా, నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. గత 48 గంటల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టంచేశారు.మరోవైపు ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో గత 24 గంటల్లో 27 ఆయుధాలు, 245 తూటాలు, 41 బాంబులను, బిష్ణుపుర్‌ జిల్లాలో ఒక ఆయుధం, రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంఖ్య 896, తూటాల సంఖ్య 11,763కు, బాంబుల సంఖ్య 200కు చేరిందని వివరించారు.


కుదుటపడుతున్న కొల్హాపుర్‌

పుణె: మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు టిప్పు సుల్తాన్‌ ఫొటోతో పాటు ఓ అభ్యంతరకర సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌గా పెట్టుకోవడంతో మంగళ, బుధవారాల్లో ఆందోళనలతో అట్టుడికిన కొల్హాపుర్‌ నగరం గురువారం కాస్త కుదుటపడింది. అక్కడ కొత్తగా ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోలేదు. దుకాణాలు తెరుచుకున్నాయి. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ముందుజాగ్రత్త చర్యగా నగరమంతటా ఇప్పటికీ భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలో తాజా ఘర్షణలకు సంబంధించి మొత్తం 36 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన స్టేటస్‌ను పెట్టుకున్నట్లు గుర్తించామని, వారంతా కళాశాలలకు వెళ్లే మైనర్లేనని పేర్కొన్నారు.


ఆరోగ్య మౌలిక వసతులను ప్రక్షాళించిన మోదీ సర్కారు

అమిత్‌ షా వ్యాఖ్య

దిల్లీ: గత 9 ఏళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని స్థాయిల్లో దేశంలోని ఆరోగ్య సంబంధ మౌలిక వసతులను సమూలంగా ప్రక్షాళించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పేదలకు ఏటా రూ.5లక్షల వరకూ ఉచిత వైద్యం అందేలా చూస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆరోగ్య రక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చేశారని వివరించారు. ‘‘అది కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కావొచ్చు.. టెలిమెడిసిన్‌ కావొచ్చు.. ఆరోగ్య పరిరక్షణ అనేది పౌరులకు సులువుగా లభ్యమవుతోంది’’ అని పేర్కొన్నారు.


వచ్చే సమావేశానికైనా హాజరయ్యేలా చూడండి
ఐఏఎస్‌ అధికారి రాజశేఖర్‌పై సీఎస్‌ను కోరిన దిల్లీ అసెంబ్లీ కమిటీ

దిల్లీ: ఓ వ్యక్తితో అమర్యాదకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి వైవీవీజే రాజశేఖర్‌ తమ ఎదుట హాజరు కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన దిల్లీ అసెంబ్లీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నరేశ్‌ కుమార్‌కు గురువారం ఓ లేఖ రాసింది. ప్రత్యేక కార్యదర్శిగా (సర్వీసెస్‌) పనిచేస్తున్న రాజశేఖర్‌ జూన్‌ 13న జరిగే సమావేశానికి హాజరయ్యేలా చూడాలని అందులో కోరింది. నకుల్‌ కశ్యప్‌ అనే వ్యక్తితో అనుచితంగా ప్రవర్తించడం, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బయటకు చెప్పలేని పదాలు వాడడం వంటి ఆరోపణలపై జూన్‌ 6న తమ ఎదుట హాజరు కావాలని కమిటీ గతంలోనే రాజశేఖర్‌ను ఆదేశించింది. అయితే ఆయన హాజరు కాలేదు. ఆరో తేదీన సమావేశం ప్రారంభం కావాల్సిన 4.45 గంటలకు ఎనిమిది నిమిషాల ముందు ఓ లేఖ పంపారు. కారుణ్య ప్రాతిపదికన నియామకాల అంశం సర్వీసెస్‌ కిందకు వస్తుందని, కమిటీ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సమావేశాన్ని రాజశేఖర్‌ అంతగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


అమృత్‌సర్‌ వద్ద పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌

చండీగఢ్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరువలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చేశారు. టార్న్‌ టరణ్‌ జిల్లాలో మరో పాక్‌ డ్రోన్‌ జారవిడిచిన రెండున్నర కిలోల హెరాయిన్‌ ప్యాకెట్‌ పట్టుబడింది. భారత్‌లోకి మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా రవాణా చేస్తున్న పాకిస్థాన్‌పై మెరుపుదాడులు నిర్వహించాలని పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ డిమాండ్‌ చేశారు.


విదేశాల్లో భారత్‌ను విమర్శించడం రాహుల్‌కు అలవాటుగా మారింది: జైశంకర్‌

దిల్లీ: విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అలవాటుగా మారిందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ దుయ్యబట్టారు. దేశ అంతర్గత విషయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తావించడం దేశ ప్రయోజనాలకు మేలు చేయదని మండిపడ్డారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను జైశంకర్‌ ప్రస్తావించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. తూర్పు లద్ధాఖ్‌లో చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకూ ఆ దేశంతో సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. దళాలను ముందుకు మోహరించడమే అసలు సమస్యని పేర్కొన్నారు. అలాగే సీమాంతర ఉగ్రవాద కార్యక్రమాలను మనదేశం ఎన్నటికీ సహించబోదన్నారు. మనదేశంతో సత్సంబంధాలను కోరుకుంటే ఏం చేయాలో పాకిస్థాన్‌కు తెలుసన్నారు.


దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌లో మంటలు

ప్రయాణికులు సురక్షితం

భువనేశ్వర్‌: ఒడిశాలోని నౌపడా జిల్లా ఖరియార్‌ రోడ్‌ స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌రైలు ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. బి-3 కోచ్‌ వద్ద మంటలను గుర్తించిన అధికారులు వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో భయబ్రాంతులైన ప్రయాణికులు రైలు దిగి పక్కకు వెళ్లిపోయారు. బ్రేక్‌ ప్యాడ్‌ వరకే మంట పరిమితమైందని.. ప్రయాణికులంతా సురక్షితమేనని తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. గంట ఆలస్యంగా రాత్రి 11 గంటలకు ఈ రైలు అక్కడి నుంచి బయలుదేరినట్లు పేర్కొన్నారు.


ఒడిశా ప్రమాద బాధితులకు జైపుర్‌ కృత్రిమ అవయవాలు

జైపుర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో కాళ్లూ, చేతులూ కోల్పోయినవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు అమర్చడానికి ‘భగవాన్‌ మహావీర్‌ వికలాంగ్‌ సహాయత సమితి’ (బీఎంవీఎస్‌ఎస్‌) ముందుకు వచ్చింది. సమితి వ్యవస్థాపకుడు డి.ఆర్‌.మెహతా ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. భువనేశ్వర్‌ సమీపంలో ఉన్న తమ కేంద్రం ద్వారా వీటిని అమరుస్తామని చెప్పారు. అవయవాలు తెగిపోయినవారికి ఆ గాయాలు మానడానికి మూడు నెలల సమయం పడుతుందనీ, అందువల్ల ఆ తర్వాత కృత్రిమ అవయవాలు అందిస్తామని తెలిపారు. అవసరమైతే తమ సంచార విభాగాన్ని బాధితుల గ్రామాలకే పంపించి, వారి ఇళ్లవద్దనే సేవలు అందిస్తామని చెప్పారు..


బిహార్‌ ప్రయాణికుల్లో ఆచూకీ లేని 19 మంది

పట్నా: ఒడిశా ప్రమాదంలో బిహార్‌కు చెందిన 50 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ విషయాన్ని బిహార్‌ విపత్తు యాజమాన్య విభాగం తెలిపింది. ఒడిశా అధికారులతో మాట్లాడి, అక్కడే ఉన్న బిహార్‌ క్షతగాత్రులను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలు చేపట్టినట్లు వివరించింది.


పట్టాలు తప్పిన ఊటీ రైలు

కూనూర్‌: ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం ఊటీకి రాకపోకలు చేసే పర్యాటకులు అమితంగా ఇష్టపడే నీల్‌గిరి రైలు గురువారం పట్టాలు తప్పింది. ఊటీ నుంచి మెట్టుపాలయం వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కూనూరు రైల్వేస్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఈ రైల్లో ఒక పెట్టె పట్టాలు తప్పింది. వెంటనే లోకోపైలట్‌ స్పందించి రైలును నిలిపేశారు. ఆ సమయంలో రైల్లో ఉన్న 165 మంది ప్రయాణికులు హడావుడిగా కిందికి దిగిపోయారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికుల్ని మెట్టుపాలయం చేర్చడానికి రైల్వేవర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. దాదాపు మూడు గంటలపాటు సిబ్బంది శ్రమించి, పట్టాలు తప్పిన పెట్టెను సరిచేశారు.


కెనడా చదువు అర్హత పరీక్ష స్కోరింగులో మార్పులు

దిల్లీ: కెనడాలో చదువుకునేందుకు ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్షకు నేరుగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇకపై ప్రతి విభాగంలో కనీసం 6 బాండ్ల చొప్పున సాధించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ది ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) విభాగం చేసిన ఈ మార్పులు ఆగస్టు 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇకపై ఓవరాల్‌గా 6 బాండ్ల స్కోరు సాధిస్తే సరిపోతుందని ఐడీపీ ఎడ్యుకేషన్‌ దక్షిణాసియా, మారిషస్‌ ప్రాంతీయ సంచాలకుడు పీయుష్‌ కుమార్‌ తెలిపారు.


ఆధునిక వైద్యం చేసేందుకు 2024లో అర్హత పరీక్ష

దిల్లీ: మన దేశంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారితోపాటు విదేశాల్లో వైద్య విద్యాభ్యాసం చేసినవారు కూడా వైద్యవృత్తిని అభ్యసించేందుకు ‘జాతీయ నిష్క్రమణ పరీక్ష’ (నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌-ఎన్‌ఈఎక్స్‌టీ)ను వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉంది. దీనిని దిల్లీలోని ఎయిమ్స్‌ చేపడుతుందని అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి. ఆధునిక వైద్యం చేయడానికి, ప్రతిభ ఆధారంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరడానికి, విదేశాల్లో చదువుకుని భారత్‌లో వైద్యం చేయాలనుకుంటున్నవారికి ఈ ఉమ్మడి పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్ట నిబంధనల్ని కేంద్ర సర్కారు 2020 సెప్టెంబరులోనే మార్పుచేసింది. అవి అమల్లోకి వచ్చిన మూడేళ్లలోనే పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికి కాలపరిమితిని 2024 సెప్టెంబరు వరకు పొడిగించారు. విధివిధానాలు రూపొందించడం, సిలబస్‌, పరీక్ష తీరుతెన్నులు, పరీక్షల సంఖ్య వంటివి నిర్ణయించాల్సి ఉంది. నమూనా పరీక్షలు కూడా అవసరమవుతాయి. దేశవిదేశాల్లో ఎక్కడ చదువుకున్నవారికైనా ఒకటే పరీక్ష ఉంటుంది. అందువల్ల డిగ్రీల పరస్పర గుర్తింపు సమస్య కూడా పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.


టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ భార్యను విచారించిన ఈడీ

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్‌ బెనర్జీ భార్య రుజిరాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బొగ్గు దోపిడీ కేసులో గురువారం దాదాపు నాలుగు గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ఈడీ కార్యాలయానికి రుజిరా చేరుకోగా.. మూడు పేజీల ప్రశ్నావళిని అధికారులు ఆమె ముందుంచారు. విదేశీ బ్యాంకు ఖాతాల గురించి ఆరా తీసి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. గత సోమవారం తన ఇద్దరు పిల్లలతో కలిసి రుజిరా యూఏఈ విమానం ఎక్కేందుకు బయలుదేరగా.. కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు ఆమెను అడ్డుకొన్నారు. జూన్‌ 8న ఈడీ ఎదుట హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.

స్కూలు ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి 13న విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్‌ బెనర్జీకి సైతం ఈడీ సమన్లు జారీ చేసింది.   ఇప్పుడు రాలేనని, ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున పంచాయతీ ఎన్నికల తర్వాత జులైలో హాజరవుతానని ఆయన బదులిచ్చారు. .


ఆవుల రవాణా..నేరం కాదు

అలహాబాద్‌ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్‌: ఆవుల రవాణా నేరం కాదని, దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ గో హత్య నిరోధక చట్టం వర్తించదని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఆరు ఆవులను రవాణా చేస్తుండగా అరెస్టయిన కుందన్‌ యాదవ్‌ బెయిల్‌ దరఖాస్తును న్యాయస్థానం అనుమతించింది. ఈ సందర్భంగా ‘‘దరఖాస్తుదారుడు గో హత్యకు కారణమైనట్లు నిరూపించే సాక్ష్యాలు లేవు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆవులను ఒక చోట నుంచి ఇంకో చోటకు రవాణా చేయడం నేరం కాదు. ఇది గో హత్య నిరోధక చట్టపరిధిలోకి రాదు’’ అని తెలిపింది.


ఈవీఎంల ప్రాథమిక స్థాయి తనిఖీలకు ఈసీ శ్రీకారం

దిల్లీ: ఐదు రాష్ట్రాలకు ఈ ఏడాది, లోక్‌సభకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల దృష్ట్యా ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు’ (ఈవీఎంలు), ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌లు) ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే ప్రాథమిక స్థాయి తనిఖీలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. నమూనా పోలింగ్‌ నిర్వహించి ఓట్లు లెక్కించడం దీనిలో భాగం. వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం సహా దేశమంతటా యంత్రాల తనిఖీలు జరగనున్నాయని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఉప ఎన్నికలు జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ యంత్రాల పరిశీలన చేపడుతున్నట్లు చెప్పారు. ఈసీఐఎల్‌, బీఈఎల్‌ సంస్థల ఇంజినీర్లు ఈ యంత్రాల్లో సాంకేతిక వైఫల్యాలను తనిఖీ చేస్తారని, సరిగా పనిచేయనివాటిని తయారీ సంస్థలకు తిరిగి పంపిస్తారని తెలిపారు.


మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు

దిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని 50 మంది ప్రముఖ శాస్త్రవేత్తల బృందం తాజా విశ్లేషణలో తేల్చింది. మానవ కార్యకలాపాల వల్ల గత దశాబ్ద కాలంగా ఏటా సగటున 54 గిగాటన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌తో సమానమైన గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయని వెల్లడించింది. ప్రధానంగా శిలాజ ఇంధనాల వాడకంతో భూతాపం వేగంగా పెరుగుతోందని తెలిపింది. పారిశ్రామిక విప్లవం ముందునాటి స్థాయులతో పోలిస్తే 2010-19 మధ్య భూతాపం 1.07 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగిందని పేర్కొంది. ఆ పెరుగుదల గత దశాబ్ద కాలంలో (2013-2022) 1.14 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని తెలియజేసింది. బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజా విశ్లేషణకు నేతృత్వం వహించారు.


బాంబు ఫిర్యాదుతో రెండు గంటలు ఆలస్యమైన విమానం

దిల్లీ: బాంబు గురించి ఓ ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదుతో దిల్లీ నుంచి ముంబయికి వెళ్లాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యమైంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి బుధవారం సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే ఓ ప్రయాణికుడు తన బ్యాగులో ఉన్న బాంబును భద్రతా సిబ్బంది గుర్తించలేరంటూ ఫోనులో ఎవరికో చెబుతుండగా తాను విన్నానని ఓ ప్రయాణికురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నిలిపివేసి క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. అనంతరం సాయంత్రం 6.45కు విమానం బయల్దేరింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు