ప్రపంచ సుందరి ఎంపికకు వేదికగా భారత్‌

దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత భారత్‌ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.

Published : 09 Jun 2023 05:39 IST

27 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం

దిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత భారత్‌ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 1996లో ఈ అంతర్జాతీయ పోటీలకు భారత్‌ వేదికగా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు 71వ ప్రపంచ సుందరి - 2023 ఫైనల్‌ పోటీలు వచ్చే నవంబరు నెలలో ఇక్కడ జరగనున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం’’ అని వివరించారు. ఈ పోటీల ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన గతేడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) మాట్లాడుతూ.. ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ఈ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మిస్‌ ఇండియా వరల్డ్‌ సినీ శెట్టి కూడా మాట్లాడారు.


ఆరుసార్లు టైటిల్‌ గెలిచిన భారత్‌

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్‌ గతంలో ఆరుసార్లు గెలిచింది. రీటా ఫరియా (1966), ఐశ్వర్యారాయ్‌ (1994), డయానా హెడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) ఇప్పటిదాకా భారత్‌ నుంచి ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని