‘అగ్ని ప్రైమ్‌’ పరీక్ష విజయవంతం

అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల వ్యూహాత్మక, అత్యాధునిక బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని ప్రైమ్‌’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.

Published : 09 Jun 2023 05:20 IST

బాలేశ్వర్‌: అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల వ్యూహాత్మక, అత్యాధునిక బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని ప్రైమ్‌’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి దీన్ని ప్రయోగించారు. తాజా పరీక్షకు సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పేర్కొంది. అభివృద్ధి దశల్లో మూడుసార్లు విజయవంతంగా ఈ అస్త్రాన్ని పరీక్షించారు. ఇక దళాల్లోకి ప్రవేశపెట్టే ముందు తొలిసారి రాత్రి సమయంలో ప్రయోగించారు. ఈ క్షిపణి గమనాన్ని రాడార్‌, టెలిమెట్రీ, ఎలక్ట్రోఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలతో నిశితంగా పరిశీలించామని అధికారులు తెలిపారు. దీన్ని సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని డీఆర్‌డీవో సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, సాయుధ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.అగ్ని ప్రైమ్‌.. 1,000-1,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 1,000 కిలోల వరకు అణువార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. రెండు దశలు కలిగిన ఈ అస్త్రం అగ్ని-1 కంటే తేలికగా ఉంటుంది. 4వేల కి.మీ. పరిధి కలిగిన అగ్ని-4, 5వేల కి.మీ. రేంజ్‌ కలిగిన అగ్ని-5లోని ప్రత్యేకతలను ఇందులోనూ జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని