దేశంలో 11.4% మందికి మధుమేహం!

దేశంలో 11.4 శాతం ప్రజలకు మధుమేహం, 35.5 శాతం మందికి రక్తపోటు (బీపీ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ తాజాగా విడుదల చేసిన ‘ఇండియాస్‌ మెటబాలిక్‌ హెల్త్‌ రిపోర్ట్‌’ వెల్లడించింది.

Published : 10 Jun 2023 05:51 IST

తెలుగు రాష్ట్రాల్లో కొంత మెరుగ్గా..
17వ స్థానంలో తెలంగాణ, 19వ స్థానంలో ఏపీ
ఐసీఎంఆర్‌ నివేదిక వెల్లడి
35.5% మందిలో బీపీ

ఈనాడు, దిల్లీ: దేశంలో 11.4 శాతం ప్రజలకు మధుమేహం, 35.5 శాతం మందికి రక్తపోటు (బీపీ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ తాజాగా విడుదల చేసిన ‘ఇండియాస్‌ మెటబాలిక్‌ హెల్త్‌ రిపోర్ట్‌’ వెల్లడించింది. 15.3 శాతం మంది పూర్వమధుమేహ (ప్రీడయాబెటిక్‌) స్థితిలో ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల్లో అసాంక్రమిక వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన ఈ అధ్యయనంలో బీపీ, ఊబకాయం తదితర సమస్యల తీవ్రతను గుర్తించింది. అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లో కూడా ప్రచురితమయ్యాయి. మొత్తం 1,13,043 మంది నుంచి నమూనాలు సేకరించి నివేదిక రూపొందించారు. మధుమేహానికి సంబంధించి దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలివీ..

* మధుమేహం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, పుదుచ్చేరి, కేరళ, చండీగఢ్‌, దిల్లీ తొలి 5 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 9.9%, ఆంధ్రప్రదేశ్‌లో 9.5% మందికి మధుమేహం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల కంటే కేరళ (25.5%), తమిళనాడు (14.4%), కర్ణాటక (10.6%)ల్లో మధుమేహులు అధిక సంఖ్యలో ఉన్నారు.

* తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 14.9% మంది ప్రీడయాబెటిక్‌ స్థితిలో ఉన్నారు. 30% మందికిపైగా బీపీ, 25% మందికిపైగా స్థూలకాయంతో బాధపడుతున్నారు. రక్తపోటు, ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌లో తెలుగు రాష్ట్రాలు రెడ్‌ జోన్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

* దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో అసాంక్రమిక వ్యాధుల భారం ఎక్కువగా ఉంది. మధుమేహం పట్టణ ప్రాంతాల్లో 16.4%, గ్రామీణాల్లో 8.9% ప్రబలినట్లు నివేదిక తెలిపింది.

* దేశంలో 28.6% మంది ఊబకాయంతోను, 39.5% ఉదర ఊబకాయంతోను, 35.5% బీపీతోను, 24% మంది హైబ్లడ్‌ కొలెస్ట్రాల్‌తోను బాధ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని