బ్రిజ్‌భూషణ్ ఇంట్లో సీన్ రీక్రియేషన్
భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లి నిర్వహించిన పోలీసులు
దిల్లీ: భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం మహిళా రెజ్లర్‌ను ఆయన నివాసానికి తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ రీక్రియేట్ చేశారు. బ్రిజ్ భూషణ్ అధికారిక నివాసంలోనే రెజ్లింగ్ సమాఖ్య కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దిల్లీలోని బ్రిజ్ భూషణ్ అధికారిక నివాసానికి పోలీసులు మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు పోలీసులు అక్కడ ఉన్నారు. ఆ నివాసంలో ఎక్కడెక్కడ వేధింపులకు గురైందో గుర్తుకు తెచ్చుకుని ఆ సీన్‌ను రీక్రియేట్ చేయాలని పోలీసులు ఆమెను అడిగారు’’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, లైంగిక ఆరోపణల వ్యవహారంలో రాజీ కుదుర్చుకునేందుకు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై వినేశ్ ఫొగాట్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘‘బ్రిజ్ భూషణ్ శక్తి ఇదే. ఆయన తన కండబలం, రాజకీయ బలంతో మహిళా రెజ్లర్లను వేధించారు. తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తేనే.. న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంటుంది. లేకపోతే ఎలాంటి ఆశా ఉండదు’’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళన సందర్భంగా రెజ్లర్లు విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదని పేర్కొంటూ దిల్లీ పోలీసులు శుక్రవారం న్యాయస్థానంలో చర్యా నివేదిక సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.