సంక్షిప్త వార్తలు (8)

అమర్‌నాథ్‌ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Updated : 10 Jun 2023 06:21 IST

అమర్‌నాథ్‌ యాత్ర ఏర్పాట్లపై అమిత్‌షా సమీక్ష

దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో యాత్ర కొనసాగే మార్గంలో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జులై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 62 రోజులపాటు ఈ వార్షిక యాత్ర కొనసాగుతుంది. ఈ సమీక్షలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఆర్మీ ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ డేకా తదితరులు పాల్గొన్నారు. యాత్రికులందరికీ ఆర్‌ఎఫ్‌ఐడీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తద్వారా వారు ఎక్కడున్నారో సులువుగా కనుక్కోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఒక్కో యాత్రికుడికి రూ.5లక్షల చొప్పున, యాత్రికులను మోసుకెళ్లే ఒక్కో జంతువుకు రూ.50వేల చొప్పున బీమా సౌకర్యం కల్పించనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం శ్రీనగర్‌, జమ్మూల నుంచి రాత్రి వేళల్లో గగన ప్రయాణ సేవలు అందుబాటులో ఉంచాలని, తగినంత సంఖ్యలో ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు, అంబులెన్సులు, హెలికాప్టర్ల ఏర్పాటుతో పాటు అదనపు వైద్య సిబ్బందిని నియమించాలని షా ఆదేశించారు. ఆన్‌లైన్‌లో శివలింగ దర్శనం, అమర్‌నాథ్‌ గుహలో ఉదయం, సాయంత్రం నిర్వహించే పూజల ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


కృత్రిమ మేధను నియంత్రిస్తాం
కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

దిల్లీ: దేశంలో డిజిటల్‌ వినియోగదారులకు ఎలాంటి హాని కలిగించకుండా ఉండేలా కృత్రిమ మేధ (ఏఐ)ను నియంత్రిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. సైబర్‌ నేరాలకు ముకుతాడు వేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దిల్లీలో శుక్రవారం భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా 85 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. ఇదే సమయంలో అంతర్జాలంలో విద్వేష ఘటనలు, నేరాలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు హాని కలగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటాం. కృత్రిమ మేధను నియంత్రిస్తాం’’ అని పేర్కొన్నారు.


జల్‌ జీవన్‌ మిషన్‌తో 4 లక్షల మరణాలను అడ్డుకోవచ్చు

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

దిల్లీ: అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగు నీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌ జీవన్‌ పథకం పూర్తయితే అతిసారం వల్ల కలిగే 4 లక్షల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కగట్టింది. ఇంతవరకు 62% గ్రామీణ కుటుంబాలకు కొళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్‌లో 100 శాతం పల్లె కుటుంబాలకు మంచి నీరు అందిస్తే పారిశుద్ధ్యానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అతిసార మరణాలను జల్‌ జీవన్‌ మిషన్‌తో నివారించడం ద్వారా 10,100 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని లెక్కగట్టింది.


బీసీఐ గుర్తించిన కళాశాలలో చదివితేనే న్యాయవాదిగా నమోదు: సుప్రీంకోర్టు

దిల్లీ: న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) గుర్తించిన కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించడం తప్పనిసరని శుక్రవారం సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీఐ రూపొందించిన నిబంధన చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు తన తీర్పులో న్యాయవాదిగా నమోదు కావాలంటే అడ్వకేట్స్‌ యాక్ట్‌ (1961)లోని సెక్షన్‌ 24నే అనుసరించాలని, బీసీఐకి ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించే అధికారాలు లేవని పేర్కొంది.


మీడియా సిబ్బందికి యోగా అవార్డుల పునరుద్ధరణ

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వెల్లడి

దిల్లీ: యోగాపై అవగాహన కల్పించడంలో మీడియా సిబ్బంది కృషికి గుర్తింపుగా ఇచ్చే అవార్డులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తమ మంత్రిత్వశాఖ మొత్తం 33 ‘అంతర్రాష్ట్రీయ యోగా దివస్‌ మీడియా సమ్మాన్‌’ పురస్కారాలు ఇవ్వనుందని, వీటిలో 11 ప్రింట్‌ మీడియాకు, 11 టెలివిజన్‌ మీడియాకు, 11 రేడియో విభాగానికి ఇస్తామని చెప్పారు. ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా జూన్‌ 2019లో ప్రకటించింది. అనంతరం జనవరి 7, 2020న పురస్కారాలను అందజేసింది. ఆ తర్వాత కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో సస్పెండ్‌ చేసింది. ఈ ఏడాదికి సంబంధించి మీడియా సంస్థలు.. జూన్‌ 10, 2023 నుంచి జూన్‌ 25, 2023 మధ్య ప్రచురించిన కథనాలు, లేదా ప్రసారం చేసిన ఆడియో లేదా వీడియో కంటెంట్‌తోపాటు నిర్ణీత విధానంలో దరఖాస్తును పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు 1 జులై, 2023ను చివరి తేదీగా నిర్ణయించారు. 2015 నుంచి ఏటా జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ హైకోర్టులో కేజ్రీవాల్‌ సమీక్ష పిటిషన్‌

ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో లేవని వెల్లడి

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను అందజేయాలన్న కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఉత్తర్వులను నిలిపివేస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అదే న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. సీఐసీ తీర్పు ప్రకారం గుజరాత్‌ విశ్వవిద్యాలయం మోదీ డిగ్రీ వివరాలను కేజ్రీవాల్‌కు అందజేయాల్సి ఉంది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ గుజరాత్‌ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. మోదీ డిగ్రీ వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయంటూ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో మార్చి నెలలో సీఐసీ ఆదేశాలను నిలిపివేయడంతో పాటు కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానాను హైకోర్టు విధించింది.  గుజరాత్‌ విశ్వవిద్యాలయం చెప్పినట్లుగా ఆ డిగ్రీ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభించడం లేదని కేజ్రీవాల్‌ తన రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌ బీరెన్‌ వైష్ణవ్‌ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. గుజరాత్‌ విశ్వవిద్యాలయానికి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులుకు నోటీసులు జారీ చేశారు.


పాఠ్య పుస్తకాల్లో సవరణలు అహేతుకం

వాటిలో మా ఇద్దరి పేర్లు తొలగించండి
ఎన్‌సీఈఆర్‌టీకి పూర్వపు పాఠ్య పుస్తకాల ప్రధాన సలహాదారుల లేఖ

దిల్లీ: హేతుబద్ధీకరణ పేరిట ఏకపక్షంగా, అహేతుకంగా పాఠ్యపుస్తకాల్లో సవరణలు చేపట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుహాస్‌ పాల్షికర్‌, యోగేంద్ర యాదవ్‌లు ఎన్‌సీఈఆర్‌టీకి లేఖ రాశారు. వీరిద్దరూ 2005లో ప్రచురితమైన 9 నుంచి 12 తరగతుల పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాలకు ప్రధాన సలహాదారులు. ప్రస్తుతం చేపట్టిన హేతుబద్ధీకరణ ప్రక్రియ పాఠ్యపుస్తకాల స్వరూపాన్ని దెబ్బతీసిందని, వాటిని విద్యాపరంగా నిరర్థకంగా మార్చారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల్లో ప్రధాన సలహాదారులుగా ఉన్న తమ పేర్లను తొలగించాలని కోరుతూ వారు ఎన్‌సీఈఆర్‌టీకి లేఖ రాశారు. ‘సవరణలు సమర్థించుకుంటున్నప్పటికీ.. వాటిలో బోధనాపరమైన హేతుబద్ధీకరణ చూడలేకపోయాం. పాఠాలు గుర్తించలేని విధంగా ముక్కలు చేశారు. లెక్కలేనన్ని కోతలు, తొలగింపులు ఉన్నాయి. భర్తీ చేయకుండా ఖాళీలను వదిలేశారు. ఈ మార్పుల గురించి మమ్మల్ని ఎవ్వరూ సంప్రదించలేదు. తొలగింపులను మేము వ్యతిరేకిస్తున్నాం’ అని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీకి రాసిన లేఖలో వారిద్దరూ పేర్కొన్నారు.


ప్రగల్భాలు కాదు.. వ్యూహాలు కావాలి

వాస్తవాధీన రేఖతోపాటు ఇప్పుడు ఉత్తరాఖండ్‌ సరిహద్దు సమీపంలోనూ చైనా సైనిక నిర్మాణాలు చేపడుతోంది. డ్రాగన్‌ చర్యలతో మన ప్రాదేశిక సమగ్రత దెబ్బతింటోంది. ప్రధాని మోదీ చైనాకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం వల్ల దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి తప్ప బూటకపు ప్రగల్భాలతో ప్రయోజనం లేదు.

మల్లికార్జున ఖర్గే


దేశంలో పాల సంక్షోభం

భారత్‌ పాల సంక్షోభం ముంగిట ఉంది. అధిక ద్రవ్యోల్బణం, పశుగ్రాసం ధరల పెరుగుదలతో పాడి రైతులు సతమతమవుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అయిన మన దేశం ఇప్పుడు విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

జైరాం రమేశ్‌


సిద్దూ దయతోనే మాన్‌కు సీఎం పదవి

పంజాబ్‌కు నవజోత్‌ సింగ్‌ సిద్దూ సారథ్యం వహించాలని కేజ్రీవాల్‌ కోరుకున్నారు. ఎన్నికలకు ముందు సిద్దూను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్‌కు ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో సిద్దూ ఆప్‌లో చేరలేదు. ఆయన దయ వల్లే భగవంత్‌ మాన్‌కు పంజాబ్‌ సీఎం పదవి దక్కింది.

నవజోత్‌ కౌర్‌, సిద్దూ సతీమణి


విజేతల అలవాట్లు ఇవీ..

నేను గమనించిన కొందరు విజేతల అలవాట్లు ఇవీ.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకుంటారు. కొత్త ఆలోచనలు వినడానికి ఆసక్తి చూపుతారు. ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. పుస్తకాలు విస్తృతంగా చదువుతారు. ఖర్చులు ఆదాయం కన్నా తక్కువ ఉండేలా జాగ్రత్త పడతారు. పొదుపు సొమ్మును మదుపు చేస్తారు. 

హర్ష్‌ గోయెంకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని