ఔరంగజేబును కీర్తిస్తూ బాలుడి స్టేటస్‌.. మహారాష్ట్రలోని ఆష్టీలో ఉద్రిక్తతలు

మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ 14 ఏళ్ల ఓ బాలుడు సామాజిక మాధ్యమ వేదికలో గురువారం స్టేటస్‌ పెట్టుకోవడం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా ఆష్టీ పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీసింది.

Published : 10 Jun 2023 05:22 IST

ఔరంగాబాద్‌, నాసిక్‌: మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ 14 ఏళ్ల ఓ బాలుడు సామాజిక మాధ్యమ వేదికలో గురువారం స్టేటస్‌ పెట్టుకోవడం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా ఆష్టీ పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత స్టేటస్‌ను నిరసిస్తూ ఆష్టీలో బంద్‌కు కొన్ని హిందుత్వ సంస్థలు పిలుపునిచ్చాయని బీడ్‌ ఎస్పీ నందకుమార్‌ ఠాకుర్‌ తెలిపారు. దాంతో పట్టణంలో వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయని పేర్కొన్నారు. అయితే ఎక్కడా ఘర్షణలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. ఔరంగజేబును కీర్తిస్తూ స్టేటస్‌ పెట్టుకున్న బాలుడు ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడని, అతణ్ని ఆష్టీకి రప్పించి బాలల నేర న్యాయస్థానంలో ప్రవేశపెడతామని చెప్పారు.

* మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఘోటీ పట్టణంలో ఓ వ్యక్తి (23) గురువారం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పోస్టు తమ మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉందంటూ కొందరు స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వారి ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు- టిప్పు సుల్తాన్‌ స్టేటస్‌ కారణంగా మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ నగరంలో తలెత్తిన ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారాయని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని