సంక్షిప్త వార్తలు (8)

ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది.

Updated : 11 Jun 2023 06:27 IST

దీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్‌..
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌ సింగ్‌ రావత్‌ ఇటీవల ప్రకటించారు. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి పాఠశాలలకు రాకుండా విధుల నుంచి తప్పించుకుంటున్న ఉపాధ్యాయుల జాబితాను తయారుచేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి వారు దాదాపు 150 మంది ఉన్నారని, వారందరితో పదవీ విరమణ చేయించాలని సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.


వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఇక ఉమ్మడి కౌన్సెలింగ్‌!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేవారికి ఇకపై ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ప్రతిపాదించింది. నీట్‌-యూజీ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌ జరగాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 2న గెజిట్‌ విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎన్‌ఎంసీ జారీ చేసిన సీట్ల వివరాల జాబితా ఆధారంగానే జరగాలని, అవసరమైతే పలు దశల్లో సీట్ల భర్తీ చేపట్టవచ్చని సూచించింది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమిస్తుందని ఎన్‌ఎంసీ పేర్కొంది.


కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్‌ మహార్యాలీ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పరిపాలన అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆదివారం మహార్యాలీని చేపడుతున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రకటించింది. ఆదివారం రాంలీలా మైదానంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమంలో లక్ష మంది ప్రజలు పాల్గొంటారని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు.


నేటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ గర్భ సంస్కార్‌

దిల్లీ: గర్భిణులు భగవద్గీత, రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణ చేస్తూ, సంస్కృత మంత్రాలను జపిస్తూ, యోగాభ్యాసాలు చేస్తే ఉన్నత సాంస్కృతిక విలువలు కలిగిన దేశభక్తులైన సంతానం జన్మిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ సంవర్థనీ న్యాస్‌ విశ్వసిస్తోంది. ఈ లక్ష్య సాధనకు ఆదివారం నుంచి గర్భ సంస్కార్‌ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందులో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. న్యాస్‌లో సభ్యులైన వైద్యులు దేశమంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించామని, ఒక్కో విభాగంలో 10 మంది వైద్యులు గర్భ సంస్కార్‌ కార్యక్రమాన్ని చేపడతారని న్యాస్‌ ప్రతినిధి వివరించారు. ఒక్కో వైద్యుడు మొదట తన ప్రాంతంలో 20 మంది గర్భిణులకు పవిత్ర గ్రంథ పారాయణ, మంత్రజపం, యోగాభ్యాసం నేర్పిస్తారు. క్రమంగా వారి సంఖ్యను పెంచుకుంటూ పోతారు.


రష్యా నుంచి వెనక్కి వచ్చిన విమానం

దిల్లీ: అమెరికా వెళ్తూ మార్గమధ్యంలో ఇంజిను వైఫల్యం  కారణంగా రష్యాలోని మగదన్‌లో అత్యవసరంగా దిగిన ఎయిరిండియా విమానం శనివారం తిరిగి ముంబయికి చేరుకుంది. ఇంజినీర్లు మరమ్మతు చేశాక ఉదయం బయలుదేరిన విమానం సాయంత్రానికి ముంబయి వచ్చింది. ఇప్పటికే మరో విమానం పంపించి మగదన్‌లోని ప్రయాణికులను అమెరికా చేరవేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన విమానం అత్యవసరంగా మగదన్‌లో దిగింది.


ధరలు స్థిరంగా ఉంటే.. ‘తగ్గింపు’ను కంపెనీలు పరిశీలిస్తాయి
పెట్రో ధరలపై హర్దీప్‌సింగ్‌ పురి వెల్లడి

దిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరంగా ఉండి, వచ్చే త్రైమాసికంలోనూ చమురు సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటే.. అప్పుడు ఆ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే స్థితిలో ఉంటాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రకటన చేసే స్థితిలో తాను లేనని స్పష్టంచేశారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో శనివారం హర్దీప్‌సింగ్‌ పురి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత త్రైమాసికంలో చమురు సంస్థలు పనితీరు ఫర్వాలేదన్నట్లుగా ఉందని చెప్పారు.


దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి మోదీ ఫోన్‌
ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిపై చర్చలు

దిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర సహకారంపై ప్రగతిని ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రాంఫోసా సమీక్షించారు. శనివారం మోదీ ఆయనకు ఫోన్‌ చేశారు. 12 చీతాలను ఇచ్చినందుకు రాంఫోసాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష పదవిని దక్షిణాఫ్రికా చేపట్టబోతోంది. దీనిపైనా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఆఫ్రికాలోని దేశాధినేతల శాంతి ప్రయత్నాలపై, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని రాంఫోసా హామీ ఇచ్చారు. భారత్‌లో పర్యటనపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.


ప్రజల ఆర్థిక స్థితి మెరుగైంది

దేశంలో మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి ఈ 9 ఏళ్లలో వేగంగా పెరిగింది. రూ.7లక్షల వరకూ పన్ను రాయితీ, జన్‌ ఔషధి ద్వారా చౌక ధరలకే ఔషధాలు, బీమా ప్రయోజనాలు, ఉడాన్‌ ద్వారా తక్కువ ధరకే విమాన ప్రయాణాలు తదితర సదుపాయాలతో ప్రధాని మోదీ వారికి ఆర్థికంగా అండగా నిలిచారు.

అమిత్‌ షా


భాజపా పాలన వీటికి గుర్తుండిపోతుంది

మోదీ సారథ్యంలో భాజపా పాలనలోని 2014-2023 కాలం ఈ విషయాలకు గుర్తుండిపోతుంది. 1.విద్వేష సంస్కృతి 2.నకిలీ వార్తలు, మోసం 3.మత రాజకీయాలు 4.నియంతృత్వం 5.రాజకీయ ఆర్భాటం 6.సమాచార వక్రీకరణ 7.వ్యవస్థాగత క్షీణత 8.అనుకూల మీడియా 9.ట్రోలింగ్‌ 10.అవినీతి

కపిల్‌ సిబల్‌


వంట కోసం హానికర ఇంధనాల వినియోగం

ప్రపంచ జనాభాలో 25 శాతం మంది వంట వండటానికి హానికర ఇంధనాలు ఉపయోగిస్తున్నారు. అంతర్గత ప్రదేశాల్లో వాయు కాలుష్యం వల్ల వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడటంతోపాటు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. దీనివల్ల ఏటా 30లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో, విశ్వసనీయమైన ఇంధనం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం.

ఐరాస


జీవిత క్రీడను ఆస్వాదించండి

ఆటలో గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా వంద శాతం మనసు పెట్టి గట్టి సంకల్పంతో ఆడేవాళ్లు దాన్ని తప్పకుండా ఆస్వాదిస్తారు. అలాగే జీవితంలోనూ కష్టసుఖాల గురించి భయపడకుండా ప్రతి సవాలును స్వీకరించేవారు ఆనందోత్సాహాలతో ఉంటారు. జీవితమనే క్రీడలో వారే       నిజమైన ఆటగాళ్లు.

జగ్గీ వాసుదేవ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు