విద్రోహ చర్యగా కనిపిస్తోంది

ఒడిశా రైలు ప్రమాదానికి విద్రోహ చర్యే కారణం కావొచ్చని, అదీ తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండవచ్చని సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Published : 11 Jun 2023 04:50 IST

తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండొచ్చు
ప్రధానికి 270 మంది ప్రముఖుల లేఖ

ఈనాడు, దిల్లీ ఒడిశా రైలు ప్రమాదానికి విద్రోహ చర్యే కారణం కావొచ్చని, అదీ తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండవచ్చని సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో తమకున్న అనుభవంతో ఈ అంచనాకొచ్చామని పేర్కొన్నారు. జాతీయ భద్రత, అభివృద్ధికి ముప్పుగా పరిణమిస్తున్న ఇటువంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ శనివారం ప్రధాని మోదీకి 270 మంది ప్రముఖులు లేఖ రాశారు. పట్టాల భద్రత కోసం దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల పొడవునా ఉన్న అక్రమణదారులను, చట్ట విరుద్ధ వలసదారులను వెంటనే  ఖాళీ చేయించాలని వారు కోరారు. లేఖ రాసిన వారిలో పదవీ విరమణ చేసిన హైకోర్టుల న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, బ్యూరోక్రాట్లు, మాజీ సైనికాధికారులు, రా అధికారులు, ఆదాయ పన్ను చీఫ్‌ కమిషనర్లు ఉన్నారు. ‘ఒడిశాలోని బాలేశ్వర్‌ రైలు దుర్ఘటనను చూసి మేం తీవ్రంగా కలత చెందాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకూ మీడియాలో వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. రైలు పట్టాలు తప్పడం వెనుక ఉద్దేశపూర్వక మానవ జోక్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థల ఆజ్ఞలకు అనుగుణంగానే విద్రోహానికి పాల్పడినట్లు కనిపిస్తోంది. దేశం జీ-20 సదస్సును నిర్వహిస్తున్నప్పుడు, స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరిగినప్పుడు అంతర్జాతీయంగా పేరు పొందిన భారతీయ రైల్వేపట్ల ప్రజా విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి దారుణమైన ఘాతుకానికి ఒడిగట్టిన విద్రోహులను ప్రస్తుత దర్యాప్తులో సీబీఐ గుర్తిస్తుందని మేం నమ్ముతున్నాం. దేశ ప్రాదేశిక సమగ్రత, దేశ భద్రతకోసం మీరు తీసుకొనే చర్యలకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది’ అని లేఖలో ప్రముఖులు పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో గువాహటి హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీధర్‌ రావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, దినేశ్‌ కుమార్‌, మాజీ డీజీపీ ఉమేశ్‌ కుమార్‌, తెలంగాణ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వినోద్‌ కె.అగర్వాల్‌, ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి సి.ఉమామహేశ్వరరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని