సాగరజలాల్లో సత్తా చాటిన భారత్‌

భారత నౌకాదళం తన అమేయ శక్తి సామర్థ్యాలను చాటింది. అరేబియా సముద్రంలో ఒక మెగా ఆపరేషన్‌ను నిర్వహించింది.

Published : 11 Jun 2023 05:24 IST

జంట విమానవాహక నౌకలు, జలాంతర్గాములతో భారీ విన్యాసాలు

దిల్లీ: భారత నౌకాదళం తన అమేయ శక్తి సామర్థ్యాలను చాటింది. అరేబియా సముద్రంలో ఒక మెగా ఆపరేషన్‌ను నిర్వహించింది. అందులో రెండు విమానవాహకనౌకలు, అనేక యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35 పోరాట విమానాలు పాల్గొన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఆపరేషన్‌లో విమానవాహక నౌకలు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, కొత్తగా సమకూర్చుకున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లు ప్రధాన భూమిక వహించాయి. ఇవి.. మిగ్‌-29కె యుద్ధవిమానాలు, ఎం60ఆర్‌, కామోవ్‌, ధ్రువ్‌ వంటి హెలికాప్టర్ల కోసం తేలియాడే వైమానిక స్థావరాలుగా వ్యవహరించాయి. రెండు విమానవాహకనౌకలు, ఇతర యుద్ధనౌకలు, జలాంతర్గాములు సమన్వయంతో సాగుతూ తమ పాటవాన్ని చాటాయి. ఇది సాగర వాయుశక్తిగా, హిందూ మహాసాగర ప్రాంతంలో భద్రతా భాగస్వామిగా భారత శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని నేవీ పేర్కొంది. ఒక విమానవాహకనౌకతోపాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఇతర యుద్ధనౌకలు వెంట సాగుతాయి. ఈ సమూహాన్ని ‘క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌’ (సీబీజీ)గా పేర్కొంటారు. ఈ దఫా విన్యాసాల్లో తొలిసారిగా రెండు సీబీజీలు పాల్గొన్నాయి. వీటి మధ్య అనుసంధానతను సాధించడం.. భారత సాంకేతిక సత్తాకు నిదర్శనమని నౌకాదళ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ గత ఏడాది సెప్టెంబరులో నేవీలో చేరిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని