నారీశక్తికి జై.. మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్‌సభ జైకొట్టింది.

Updated : 21 Sep 2023 07:12 IST

వెంటనే అమల్లోకి తేవాలన్న సోనియా
ఓబీసీ మహిళలనూ చేర్చాలని ఆమె డిమాండ్‌  
2029 తర్వాతే అమలు : అమిత్‌ షా

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్‌సభ జైకొట్టింది. 8 గంటల చర్చ తర్వాత దాదాపుగా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఓటింగ్‌లో 454 మంది సభ్యులు మద్దతు తెలపగా ఇద్దరే వ్యతిరేకించారు. ఓటింగ్‌ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. లోక్‌సభలోపాటు అసెంబ్లీల్లో ఈ బిల్లువల్ల 33శాతం కోటా మహిళలకు దక్కుతుంది. అంతకుముందు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. తొలుత ఉదయం బిల్లును ఆమోదించాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ సభను కోరారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌కు ముందే రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు.. ‘ప్రత్యేక’ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు అటు అధికారపక్ష ఎంపీలు దీటుగానే బదులిచ్చారు. చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని ప్రతిపక్షాలన్నీ కోరగా.. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్‌ చేపడతామని, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. బిల్లుపై లోక్‌సభలో 27 మంది మహిళా సభ్యులు ప్రసంగించారు. మొత్తం 60 మంది మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం సభలో 82 మంది మహిళా ఎంపీలున్నారు. బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఔరంగాబాద్‌ ఎంపీ సయ్యద్‌ ఇంతియాజ్‌ జలీల్‌ వ్యతిరేకించారు.


హిళా బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌.. చరిత్రాత్మక బిల్లు. అది మహిళలకు మరింత సాధికారత ఇవ్వనుంది. దీంతోపాటు దేశ రాజకీయ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుంది.

ప్రధాని మోదీ


హిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్‌ సమర్థిస్తోంది. ఇది నాకు చాలా ఉద్వేగ భరిత క్షణం. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరింది.

సోనియా గాంధీ


బిల్లులోని చిన్న చిన్న లోపాలను తరువాత సవరిస్తాం. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్‌ ప్రక్రియను తదుపరి ప్రభుత్వం చేపడుతుంది. అవి పూర్తి కాగానే రిజర్వేషన్లను అమల్లోకి తెస్తాం.

అమిత్‌ షా


నారీ శక్తి వందన్‌ అధినియమ్‌-2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు  కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. బిల్లును త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగింది. సోనియా గాంధీ చర్చను మొదలుపెట్టి ప్రసంగించారు.  ‘స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని నా భర్త రాజీవ్‌ ఆనాడు బిల్లు తీసుకొచ్చారు. అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ బిల్లును అమల్లోకి తీసుకురాగలిగింది. దాని ఫలితమే స్థానిక సంస్థల్లో ఇప్పటివరకూ దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు’ అని సోనియా వివరించారు. ‘మహిళా బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలి. చట్టం సమర్థ అమలుకు వెంటనే కులగణన చేపట్టాలి’ అని సోనియా గాంధీ కోరారు.


నేను మద్దతిస్తున్నా

-రాహుల్‌

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. అయితే ఓబీసీలకు కోటా లేకపోవడం అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనానికి మారినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించాల్సిందన్నారు. కుల గణననూ చేపట్టాలని డిమాండు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలకు చెందిన ముగ్గురు అధికారులే ఉన్నారని తెలిపారు.


ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు

-సుప్రియా

చర్చ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి భాజపా ఎంపీ నిశికాంత్‌ దూబే విమర్శలు గుప్పించారు. మహిళలను తక్కువ చేయాలని చూస్తున్న వారికి ‘ఇండియా’ కూటమి మద్దతు పలుకుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. ‘గతంలో మహారాష్ట్రలో భాజపాకు చెందిన ఓ నేత ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన ఓసారి నాతో మాట్లాడుతూ.. సూలేజీ మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి.. దేశ వ్యవహారాలు మేం చూసుకుంటామని అన్నారు. ఇది భాజపా ఆలోచనా విధానం. మహిళా చట్టసభ్యుల పట్ల భాజపా నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు’ అని దుయ్యబట్టారు.


మాకు శాల్యూట్‌ అక్కర్లేదు

-కనిమొళి

‘ఇది కేవలం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లే కాదు.. అసమానతలు, పక్షపాత ధోరణిని తొలగించే బిల్లు. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని బిల్లులో పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురు చూడాలి. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అని పేరు పెట్టారు. మాకు శాల్యూట్‌ చేసి వందనాలు చేయనక్కర్లేదు. సమానంగా గౌరవిస్తే చాలు’ అని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తావిస్తూ.. ఆమె శక్తిమంతమైన మహిళ అని అంగీకరించడానికి తనకు ఎలాంటి సంకోచాల్లేవని తెలిపారు.


రెజ్లర్లను వేధించిన ఎంపీపై చర్యలేవీ

-కకోలి

‘ఎన్నికల ముందు ఈ బిల్లును తీసుకురావడం పూర్తిగా భాజపా గిమ్మిక్కే. నిజంగా వారికి మహిళలంటే గౌరవముంటే చేతల్లో చూపించాలి. ఆటల్లో బంగారు పతకాలతో విశ్వ వేదికపై దేశ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారిణులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు.  అందుకు బాధ్యులైన వారు (భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఇక్కడే కూర్చున్నారు. మహిళా సాధికారతపై మీరు నిజంగా దృష్టి సారిస్తే.. ఆ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కకోలి ఘోష్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. బిల్లుకు మహిళా రిజర్వేషన్ల రీషెడ్యూలింగ్‌ బిల్లు అని పేరు పెట్టాలని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా సూచించారు.


ఎన్నికల గారడీ

-జేడీయూ

బిల్లుకు తాముకు మద్దతిస్తున్నామని, కానీ భాజపా బిల్లు ద్వారా ఎన్నికల గారడీ చేస్తోందని జేడీయూ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ విమర్శించారు.  ఇండియా బలంగా మారడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మహిళా బిల్లుకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని బీఎస్‌పీ ఎంపీ సంగీతా ఆజాద్‌ పేర్కొన్నారు. బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నామని శివసేన (శిందే) ఎంపీ భావనా గవాలి తెలిపారు. మంత్రివర్గాల్లోనూ 33శాతం కోటా ఉండాలని కోరారు.  బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకించారు. ఇది అగ్రవర్ణ మహిళలకే ప్రయోజనకరంగా ఉంటుందని, ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు.


స్మృతి ఇరానీ మండిపాటు

హిళా రిజర్వేషన్ల బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఉండాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కులాల వారీగా కోటా అడుగుతూ విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.


ఎన్నికలు కాగానే ప్రక్రియ చేపడతాం

-అమిత్‌ షా

తంలో నాలుగుసార్లు మహిళలను ఈ పార్లమెంటు నిరాశ పరిచిందని, ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. బిల్లుపై చర్చలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ‘సాధారణ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడో వంతు సీట్లను ఎవరు రిజర్వు చేయాలి? ఒకవేళ మేం చేస్తే వయనాడ్‌ లోక్‌సభ సీటు మహిళా రిజర్వేషన్‌ కిందికి వెళ్తే మేం రాజకీయం చేసినట్లు మీరే ఆరోపణలు చేస్తారు. ఒకవేళ హైదరాబాద్‌ సీటు రిజర్వు అయితే రాజకీయం చేశామని ఒవైసీ మాపై విమర్శలు గుప్పిస్తారు. అందుకే డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అది ప్రతి రాష్ట్రంలో క్షేత్రస్థాయికి వెళ్లి బహిరంగ విచారణ ద్వారా పారదర్శక పద్ధతిలో నిబంధనలు రూపొందిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈసారి సాంకేతిక సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి మేఘ్‌వాల్‌ తెలిపారు.  డీలిమిటేషన్‌ కమిషన్‌ లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఈ బిల్లులో  మహిళలకు సమాంతరంగా (హారిజంటల్‌), నిలువు (వర్టికల్‌) రిజర్వేషన్లు ఉన్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని