ఈవీఎంలపై పిల్‌.. సుప్రీం కొట్టివేత

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎంలలో) ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై ఆడిట్‌ నిర్వహించి, ఆ నివేదికను ప్రజలకు బహిర్గతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది.

Published : 23 Sep 2023 05:34 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎంలలో) ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై ఆడిట్‌ నిర్వహించి, ఆ నివేదికను ప్రజలకు బహిర్గతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. రాజ్యాంగపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్లు చూపించే ఆధారాలేవీ పిటిషనరు సమర్పించలేదని పేర్కొంది. ఈవీఎం సోర్స్‌కోడ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పర్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ‘‘ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) అప్పగించారు. ఈసీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలను పిటిషనరు కోర్టుకు అందించలేదు. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలు కలిగించే ఏ సమాచారాన్ని ఇవ్వలేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విధానపరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేస్తే దానిని ఎవరు హ్యాక్‌ చేయగలరో మీకు తెలుసంటూ పిటిషనరును ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. పిటిషను దాఖలుకు ముందు స్వచ్ఛంద ఆడిట్‌ కోసం ఈసీనే కోరి ఉంటే బాగుండేదని అన్నారు. ‘‘సోర్స్‌ కోడ్‌ అనేది ఈవీఎంకు ఎంతో కీలకం. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన అంశం’’ అని పేర్కొంటూ సునీల్‌ ఆహ్యా అనే వ్యక్తి ఈ పిల్‌ దాఖలు చేశారు. బ్యాలెట్ల స్థానంలో ఈవీఎంలు వచ్చాక పలు సందర్భాల్లో వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని