బలమైన ప్రభుత్వం వల్లే.. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై మోదీ

దాదాపు మూడు దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటానికి కేంద్రంలో సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఉండడం వల్లే సాధ్యమైందని ప్రధాని మోదీ తెలిపారు.

Updated : 23 Sep 2023 05:28 IST

ప్రధానిని సన్మానించిన భాజపా మహిళామోర్చా

దిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటానికి కేంద్రంలో సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఉండడం వల్లే సాధ్యమైందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఇది సాధారణ శాసనం కాదు..నవీన భారత నూతన ప్రజాస్వామ్య నిబద్ధతకు రూఢి పత్రమ’ని అభివర్ణించారు. దిల్లీలో శుక్రవారం భాజపా ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మహిళా నేతలకు ప్రధాని మోదీ వినమ్రంగా నమస్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ...బిహార్‌కు చెందిన ఆర్జేడీ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీల నేతలకు చురకలు వేశారు. ‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రతిపాదించిన బిల్లును గతంలో చింపివేసిన వ్యక్తులు కూడా తాజా బిల్లుకు మద్దతివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దశాబ్దకాలంగా తన ప్రభుత్వ హయాంలో మహిళలు ఒక శక్తిగా ఎదగటం వల్లే’నని తెలిపారు. మహిళలను బలోపేతం చేయడానికి, వారి సాధికారతకు తమ ప్రభుత్వం పలు పథకాలు తీసువచ్చిందని గుర్తు చేశారు. ఎవరి రాజకీయ ప్రయోజనాలూ మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోనివ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. తాము తీసుకున్న పలు నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చేంత శక్తిమంతమైనవని చెబుతూ...వాటిలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒకటన్నారు. ఇది మహిళల్లో నూతన విశ్వాసాన్ని నెలకొల్పి, భారత పురోగమన శక్తిని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదించడం పార్లమెంటరీ చరిత్రలో సువర్ణ ఘట్టమని ప్రధాని మోదీ అభివర్ణించారు. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, స్మృతీఇరానీతో పాటు మహిళా ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా కూడా ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని