విదేశాలకు వెళ్లడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు

సరైన ప్రాతిపదిక లేకుండా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ)లు జారీ చేసి ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లడాన్ని అడ్డుకోలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 23 Sep 2023 05:17 IST

బ్యాంకులు కోరినంత మాత్రాన ఎల్వోసీలు జారీ చేయలేరు
స్పష్టంచేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: సరైన ప్రాతిపదిక లేకుండా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ)లు జారీ చేసి ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లడాన్ని అడ్డుకోలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాల వెళ్లడమనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తేల్చి చెప్పింది. ఎల్వోసీలు జారీ చేసేటప్పుడు అధికారులు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని సూచించింది. ‘‘విదేశాలకు వెళుతున్న వారు తమకు బాకీ ఉంటే చాలు ఎల్వోసీలు జారీ చేయాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. వారిపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించకుండానే ఎల్వోసీ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇదే సమస్య’’ అని ఓ కేసుకు సంబంధించి ఈ నెల 19న వెలువరించిన ఉత్తర్వుల్లో జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ పేర్కొన్నారు. ఎవరి మీదైతే ఎల్వోసీ జారీ చేస్తున్నారో వారి విదేశీ ప్రయాణం భారత సార్వభౌమాధికారానికి, భద్రతకు, సమగ్రతకు భంగం కలిగిస్తుందా? అతడు లేదా ఆమె వెళుతున్న దేశానికి భారత్‌కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా? ఇలా తదితర అంశాలను ఎల్వోసీ జారీ చేసే అధికారులు పరిశీలించాలని న్యాయమూర్తి సూచించారు. బ్యాంకులు కోరినంతమాత్రాన వాటిని జారీ చేయలేరని పేర్కొన్నారు. ఓ వ్యక్తిని విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఆషామాషీ విషయం కాదని.. ఈ ప్రక్రియతో వారు సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని