ప్రజల ఆకాంక్షలే ఎజెండా

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.

Published : 25 Sep 2023 06:32 IST

ఆ దిశగా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరుస్తున్నాం
వందేభారత్‌ రైళ్ల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ
ఒకేసారి 9 సెమీ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చజెండా
దిల్లీ

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 11 రాష్ట్రాల మధ్య వేర్వేరు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను కలిపే తొమ్మిది వందేభారత్‌ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండాఊపి ప్రారంభించి, ప్రసంగించారు. రైల్వేల ఆధునికీకరణపై మునుపటి ప్రభుత్వాలు తగినంత దృష్టి సారించలేదని, తాము చేపట్టిన చర్యల ద్వారా దేశంలో అన్ని ప్రాంతాలనూ వందేభారత్‌లు అనుసంధానం చేసేరోజు ఎంతో దూరంలో లేదని మోదీ చెప్పారు. ఇవి అమిత ప్రజాదరణ పొందుతున్నాయని, ఇప్పటికే 25 రైళ్లలో 1.11 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. ‘పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత విశ్వసనీయ నేస్తం భారతీయ రైల్వే. మన రైళ్లలో ఒకరోజులో ప్రయాణించేవారి సంఖ్య ఎన్నో దేశాల జనాభాకంటే ఎక్కువ. రైల్వేలో మేం తీసుకువస్తున్న మార్పులు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మారుస్తాయి. రైల్వే మంత్రుల సొంత రాష్ట్రంలోనే రైల్వేను అభివృద్ధి చేయాలనే స్వార్థపర ఆలోచన దేశాన్ని ఎంతో నష్టపరిచింది. ఏ రాష్ట్రాన్నీ విస్మరించకుండా అందరితో కలిసి అందరి అభివృద్ధికి పాటుపడాలనేదే మా విధానం’ అని వివరించారు.

ప్రయాణికుల సూచనలతో మార్పులు

వందేభారత్‌ కొత్తరైళ్లలో సదుపాయాలను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. సీట్లు మరింత వెనక్కి వాలేలా సౌకర్యవంతంగా మార్చారు. మెత్తటి కుషన్‌ ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ సీట్ల రంగును ఎరుపు నుంచి నీలానికి మార్చడంతోపాటు, సీట్ల వెనుక మ్యాగజైన్‌లు ఉంచుకొనే ఏర్పాటు చేశారు. సీట్ల కింద ఉండే ఛార్జింగ్‌ పాయింట్లను సులువుగా వాడుకునేలా మార్చారు. మరుగుదొడ్లలో దీపాల కాంతి పెంచారు. వాష్‌బేసిన్‌ నుంచి నీళ్లు బయటికి చిమ్మకుండా వాటి లోతు పెంచారు. దివ్యాంగుల చక్రాల కుర్చీలు భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్లు కేటాయించారు. మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్‌ కోసం ప్యానెల్స్‌లో మార్పులు చేశారు. రైలుపెట్టెల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థను మరింత మెరుగుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు