ఐఏఎస్‌ కొలువుకు ఎసరు తెచ్చిన ‘కుక్క వాకింగ్‌’

జాతీయస్థాయి క్రీడాకారులు సాధన చేసే ప్రభుత్వ స్టేడియంలో తన కుక్కను వాకింగుకు తీసుకువెళ్లేందుకు అథ్లెట్లను బయటకు పంపిన వివాదంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిపై వేటు పడింది.

Updated : 28 Sep 2023 10:36 IST

స్టేడియం నుంచి అథ్లెట్లను గెంటిన అధికారిణికి బలవంతపు రిటైర్మెంటు

దిల్లీ: జాతీయస్థాయి క్రీడాకారులు సాధన చేసే ప్రభుత్వ స్టేడియంలో తన కుక్కను వాకింగుకు తీసుకువెళ్లేందుకు అథ్లెట్లను బయటకు పంపిన వివాదంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిపై వేటు పడింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1994 బ్యాచ్‌ అధికారిణి రింకూ దుగ్గా (54)ను ప్రభుత్వం బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపింది. ఈ మేరకు పదవీ విరమణ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ పెన్షన్‌ నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ సర్కారు ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ప్రస్తుతం రింకూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సంచార జాతుల వ్యవహారాల విభాగం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. ఆమె భర్త సంజీవ్‌ ఖిర్వార్‌ లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 

ఏం జరిగిందంటే..

సాధారణంగా దిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీగా ఉంటుంది. ఏడాది కిందట.. దిల్లీలో పనిచేస్తున్న ఈ ఐఏఎస్‌ జంట తమ పెంపుడు కుక్కతో వాకింగు చేసేందుకు స్టేడియంను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. వీరి ఆదేశాల మేరకు స్టేడియం నిర్వాహకులు నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను బయటకు వెళ్లగొట్టేవారు. ఆ తర్వాత ఈ అధికారులిద్దరూ పెంపుడు కుక్కతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగు చేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో గతేడాది మే నెలలో ప్రభుత్వం స్పందించింది. భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. తాజాగా ఆ ఇద్దరిలో రింకూపై వేటు వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని