నదుల అనుసంధానంతో తీవ్ర వర్షాభావం!

కరువులు, వరదలను శాశ్వతంగా నివారిస్తాయని భావిస్తున్న నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వకపోగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా?... అవుననే అంటోంది ‘నేచర్‌’ పత్రికలో వెలువడిన నిపుణుల అధ్యయన నివేదిక.

Published : 28 Sep 2023 06:03 IST

నిపుణుల నివేదిక హెచ్చరిక

దిల్లీ: కరువులు, వరదలను శాశ్వతంగా నివారిస్తాయని భావిస్తున్న నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వకపోగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా?... అవుననే అంటోంది ‘నేచర్‌’ పత్రికలో వెలువడిన నిపుణుల అధ్యయన నివేదిక. నదుల అనుసంధాన ప్రాజెక్టులు నీటి ఎద్దడిని తీవ్రతరం చేయడంతో పాటు రుతుపవనాల క్రమానికీ విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. ప్రాంతీయ వాతావరణ నమూనాలను, విస్తృత సమాచారాన్ని విశ్లేషించడంతో పాటు వివిధ సాంకేతిక పద్ధతులను వినియోగించి పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. జలవాతావరణ వ్యవస్థలపై భారీ నీటి ప్రాజెక్టులు చూపే ప్రభావాన్ని తమ నివేదికలో వివరించారు ఐఐటీ-బాంబే, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటియోరాలజీ(ఐఐటీఎం)-పుణె శాస్త్రవేత్తలతో పాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన బృందాలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ నీటి ప్రాజెక్టులు చూపే ప్రభావంపై వీరి అధ్యయనం కొనసాగింది.

మన దేశంలో వ్యవసాయానికి, జలవనరులకు ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలపై పరిశోధకులు దృష్టి సారించారు. నదీపరివాహక ప్రాంతాలు, భూ వాతావరణ పరిస్థితులు, నేల, గాలిలోని తేమ శాతాలు, ఉష్ణోగ్రతలు...ఇవన్నీ కలిసి వివిధ ప్రాంతాల్లో కలగజేసే పరిస్థితులను అధ్యయనం చేశారు. నదుల అనుంధానం ద్వారా ఒక ప్రాంతంలోని మిగులు జలాలను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తరలించడానికి భారీ రిజర్వాయర్లు, కాలువలు అవసరం అవుతాయి. నీటి ఆధారిత పంటల సాగు అధికమవుతుంది. దీనివల్ల వాతావరణంలో ఏర్పడే తేమ...గాలుల దిశ మారడానికి కారణమై దేశవ్యాప్తంగా వర్షాల ధోరణిని అస్తవ్యస్తం చేసే అవకాశం ఉందని అధ్యయన పత్రం పేర్కొంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా సెప్టెంబరు నెలలో సగటు వర్షపాతం 12శాతం వరకూ తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణంపై చూపే ప్రభావంపై అధ్యయనం నిర్వహించాలని నివేదిక సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని