మహాత్మా.. నీ బోధనలే మా మార్గానికి వెలుగు

గాంధీ మార్గం.. ఎప్పటికీ అనుసరణీయమని.. ఆయన ఆలోచనలు సాకారం చేసేందుకు యువత కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 03 Oct 2023 03:22 IST

దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు

దిల్లీ: గాంధీ మార్గం.. ఎప్పటికీ అనుసరణీయమని.. ఆయన ఆలోచనలు సాకారం చేసేందుకు యువత కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం.. జాతిపిత మహాత్మ గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. అక్టోబర్‌ 2నే జన్మించిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సేవలనూ దేశం స్మరించుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు గాంధీ స్మారక స్థలి రాజ్‌ఘాట్‌కు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్మారక స్థలి విజయ్‌ఘాట్‌కు చేరుకుని అంజలి ఘటించారు. ‘‘గాంధీ జయంతి సందర్భంగా  మహాత్ముడికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నా. ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. యావత్‌ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఐకమత్య స్ఫూర్తి, దయ వంటి గుణాలను మరింత వ్యాప్తి చేసేలా మానవాళిని ప్రేరేపించారు. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం కృషి చేద్దాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి సేవలనూ కొనియాడారు. సత్యం, అహింస, సామరస్య మార్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి గాంధీ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌.. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు. లండన్‌లో ప్రవాస భారతీయులు జరుపుకొన్న గాంధీ జయంతి ఉత్సవాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని