మృత్యు ఆసుపత్రి

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు.

Published : 03 Oct 2023 04:54 IST

24 గంటల్లో 24 మంది మృతి
వారిలో 12 మంది శిశువులు
నాందేడ్‌లో తీవ్ర విషాదం

ముంబయి: మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మిగిలినవారు పెద్దవారు. ‘నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో 24 మంది చనిపోయారు. చనిపోయిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారు’ అని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరు దిలీప్‌ మైశేఖర్‌ సోమవారం వెల్లడించారు. ఈ విషాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి మంగళవారం మధ్యాహ్నానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

ఈ అంశంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (భాజపా, ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండు చేస్తున్నాయి.ఈ ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.


మరో 70 మంది పరిస్థితి విషమం

-కాంగ్రెస్‌

చనిపోయిన వారిలో శిశువులతోపాటు గర్భిణులూ ఉన్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ తెలిపారు. మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కొన్ని మరణాలు గుర్తు తెలియని విషం కారణంగా సంభవించినట్లు తెలుస్తోందని చెప్పారు. 500 బెడ్లున్న నాందేడ్‌ ఆసుపత్రిలో 1200 మంది రోగులున్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని