మాలీవాల్‌పై దాడి ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated : 17 May 2024 05:37 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడిగా బిభవ్‌ కుమార్‌ పేరును పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ఇద్దరు సభ్యుల దిల్లీ పోలీసు బృందమొకటి మాలీవాల్‌తో సమావేశమై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె స్వగృహంలో జరిగిన ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగింది. దాడి ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు అదనపు పోలీసు కమిషనర్‌ పి.ఎస్‌.కుష్వాహా నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం 1.50 గంటలకు స్వాతి మాలీవాల్‌ ఇంటికి వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

బిభవ్‌కు సమన్లు

స్వాతి మాలీవాల్‌ ఆరోపణల నేపథ్యంలో బిభవ్‌ కుమార్‌కు గురువారం జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సమన్లు పంపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించింది.

కేజ్రీవాల్‌ చర్యలు తీసుకుంటారు: ప్రియాంక

మాలీవాల్‌పై దాడి జరిగిందన్న ఘటనపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తగిన చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్‌ బరేలీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..‘‘కేజ్రీవాల్‌కు ఈ విషయం తెలుసు. ఆయన తగిన పరిష్కారం కనుగొంటారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు.

భాజపా నేతలూ.. రాజకీయం చేయొద్దు: మాలీవాల్‌

పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు స్వాతి మాలీవాల్‌ గురువారం వెల్లడించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని భాజపాకు విజ్ఞప్తి చేశారు. ‘‘నా విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. వారు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నవారు నేను మరో పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వారిని ఆ దేవుడే కాపాడాలి’’ అని ‘ఎక్స్‌’లో మాలీవాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కీలకమైన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తన  విషయం అప్రాధాన్యమైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని