‘సరదా’ కోసం విమానానికి బాంబు బెదిరింపు.. 13 ఏళ్ల బాలుడు అదుపులోకి

సరదా కోసం విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడిన ఓ 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 12 Jun 2024 06:06 IST

దిల్లీ: సరదా కోసం విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడిన ఓ 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ నుంచి టొరంటో వెళ్తోన్న ఎయిర్‌ కెనడా విమానంలో బాంబు ఉందని ఈనెల 4న దిల్లీ విమానాశ్రయానికి ఓ మెయిల్‌ వచ్చింది. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. విస్తృత సోదాల అనంతరం అది గాలివార్త అని నిర్ధారించారు. ఈ ఘటనపై ఎయిర్‌ కెనడా విమానయాన సంస్థ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో బాలుడిని పట్టుకున్నారు. ‘గతంలో ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటన గురించి బాలుడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే.. పోలీసులు తనను పట్టుకుంటారో? లేదో? చూడాలనుకున్నాడు. బెదిరింపునకు కొన్ని గంటల ముందే తన ఫోన్‌లో ఈమెయిల్‌ ఐడీ సృష్టించాడు. తన తల్లి ఫోన్‌ వైఫై ఉపయోగించి మెయిల్‌ పంపాడు. అనంతరం ఆ ఐడీని డిలీట్‌ చేశాడు’ అని పోలీసులు వెల్లడించారు. భయంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని, మరుసటి రోజు బాంబు బెదిరింపు వార్తలు చూసి సరదాపడ్డానని అతడు చెప్పినట్లు తెలిపారు. అతడిని జువనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని