పవర్‌గ్రిడ్‌లో అగ్నిప్రమాదంతో దిల్లీకి కరెంట్‌ కష్టాలు

తీవ్రమైన వేడిగాలులు, నీటిసంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దిల్లీ ప్రజలు మంగళవారం విద్యుత్తుకోతలు కూడా తోడై ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Published : 12 Jun 2024 05:33 IST

దిల్లీ: తీవ్రమైన వేడిగాలులు, నీటిసంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దిల్లీ ప్రజలు మంగళవారం విద్యుత్తుకోతలు కూడా తోడై ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండోలా పవర్‌గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో దిల్లీ వాసులకు మధ్యాహ్నం నుంచి భారీగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నగరానికి 30 కి.మీ.ల దూరాన ఉన్న ఈ గ్రిడ్‌ నుంచి దిల్లీకి 1,200 మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. ‘‘మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత దిల్లీలోని పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. విద్యుత్తు సరఫరా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కొత్తగా నియమితులైన కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి అపాయింట్‌మెంటు కోరతాను. ఇక్కడ గరిష్ఠ వినియోగం 8,000 మెగా వాట్లకు చేరుకున్న సమయంలోనూ పవర్‌కట్‌ లేదు. జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల వైఫల్యం వల్లే ఈ దుస్థితి తలెత్తింది’’ అని దిల్లీ విద్యుత్తు, నీటి సరఫరా శాఖల మంత్రి ఆతిశీ తెలిపారు. కాగా, సాయంత్రానికి పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. 

ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటి దగా

హరియాణా ప్రభుత్వం కావాలనే, చట్టవిరుద్ధంగా దిల్లీకి నీటి సరఫరాను నిలిపివేస్తోందని ఆతిశీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. హరియాణా వదులుతున్న కొద్దిపాటి నీటితో దిల్లీ అవసరాలు తీరడం లేదన్నారు. దిల్లీకి సరిపడా నీటిని విడుదల చేస్తున్నామని హరియాణా అబద్ధాలు చెబుతోందని, ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీకి లేఖ రాయడంతోపాటు సుప్రీంకోర్టుకు అన్ని వివరాలు అందజేస్తామని ఆతిశీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు