లిటిగేషన్‌ పాలసీ దస్త్రానికి మోక్షం

న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి మార్గం చూపే జాతీయ వ్యాజ్య విధానం (నేషనల్‌ లిటిగేషన్‌ పాలసీ) దస్త్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.

Published : 12 Jun 2024 05:34 IST

సత్వర న్యాయానికి దారులు పడతాయన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి 

దిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి మార్గం చూపే జాతీయ వ్యాజ్య విధానం (నేషనల్‌ లిటిగేషన్‌ పాలసీ) దస్త్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మోదీ 3.0 ప్రభుత్వ వంద రోజుల ఎజెండాలో భాగంగా న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ పాలసీ దస్త్రంపై మంగళవారం సంతకం చేశారు. దస్త్రం ఆమోదానికి త్వరలో కేంద్ర క్యాబినెట్‌కు సమర్పిస్తారు. యూపీఏ-2 హయాంలో వీరప్ప మొయిలీ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాలసీకి తొలిసారి రూపమిచ్చినా క్యాబినెట్‌ ముందుకు తీసుకెళ్లలేదు. తర్వాత వెళ్లినా మంత్రివర్గం ఆమోదించలేదు. కానీ, జాతీయ న్యాయ మిషన్‌లో భాగంగా అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను 15 ఏళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడానికి లిటిగేషన్‌ పాలసీని రూపొందిస్తున్నట్లు 2010 జూన్‌ 23న అప్పటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనుకున్నంత వేగంగా మాత్రం అడుగులు పడలేదు. తర్వాత ఇదే అంశాన్ని భాజపా తన 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక న్యాయశాఖ ఈ విధానంపై మళ్లీ కొత్తగా నోట్‌ పంపింది. అయినా వివిధ కారణాలతో ఆమోదం లభించలేదు. న్యాయశాఖ మంత్రిగా మంగళవారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మేఘ్‌వాల్‌ తన మొదటి సంతకాన్ని ఈ దస్త్రంపై పెట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ‘‘‘సత్వర న్యాయం’ మా అభిమతం. అందులో భాగంగానే తీసుకొస్తున్న లిటిగేషన్‌ పాలసీ... సుప్రీంకోర్టు, హైకోర్టులు, కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు, వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల పరిష్కారానికి మార్గం చూపుతుందనే నమ్మకం ఉంది’’ అని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని