ఆరుగురు మంత్రులు శత కోటీశ్వరులు

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రి మండలి సభ్యుల్లో 99 శాతం లేదా 70 మంది కోటీశ్వేరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) మంగళవారం ఓ నివేదికలో తెలిపింది.

Updated : 12 Jun 2024 11:11 IST

ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం విశ్లేషణ

దిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రి మండలి సభ్యుల్లో 99 శాతం లేదా 70 మంది కోటీశ్వేరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) మంగళవారం ఓ నివేదికలో తెలిపింది. మంత్రుల సగటు ఆస్తి రూ.107.94 కోట్లని వెల్లడించింది. మంత్రుల్లో ఆరుగురు రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ ఆస్తులను ప్రకటించారని పేర్కొంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5,705.47 కోట్ల ఆస్తులు ప్రకటించి ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.424.75 కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించిన కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానంలో ఉన్నారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి రూ.217.23 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా, 71 మంది కేంద్రమంత్రులు, సహాయమంత్రులుగా (ఐదుగురు  స్వతంత్ర హోదా) ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

50 ఏళ్లు నిండినవారు 66% మంది..

మంత్రులుగా ప్రమాణం చేసిన 71 మందిలో 66 శాతం మంది (47 మంది) వయసు 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మంత్రులు 22 మంది ఉన్నారు. 24 శాతం మంది మంత్రులు లేదా 17 మంది వయసు 31 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండగా, వారిలో ఇద్దరి వయసు 31-40 మధ్య ఉండడం విశేషం. 

28 మందిపై క్రిమినల్‌ కేసులు

కొత్త మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా, వారిలో 19 మందిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగం వంటి అభియోగాలతో తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ విశ్లేషణలో వెల్లడైంది. పోర్టులు, నౌకాయానం, జలరవాణా శాఖ సహాయమంత్రి శాంతను ఠాకుర్, విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సుఖాంత మజుందార్‌లు.. ఐపీసీ 307 కింద హత్యాయత్నం అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్, పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖల సహాయమంత్రి సురేశ్‌ గోపీ సహా ఐదుగురు మంత్రులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.  

మంత్రిమండలి సభ్యుల్లో 11 మంది విద్యార్హత 12వ తరగతి మాత్రమే. అదే సమయంలో 57 మంది (80%) మంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని