కోల్‌కతా కళాశాలలో హిజాబ్‌ రగడ

కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేటు న్యాయ కళాశాల యాజమాన్యం హిజాబ్‌ ధరించి తరగతులకు రావద్దని కోరడంతో ఓ అధ్యాపకురాలు ఏకంగా కళాశాలకు రావడమే మానుకున్నారు.

Published : 12 Jun 2024 06:11 IST

 ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉపాధ్యాయురాలు

కోల్‌కతా: కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేటు న్యాయ కళాశాల యాజమాన్యం హిజాబ్‌ ధరించి తరగతులకు రావద్దని కోరడంతో ఓ అధ్యాపకురాలు ఏకంగా కళాశాలకు రావడమే మానుకున్నారు. ఈ మేరకు సాంజిదా ఖాదర్‌ మూడేళ్ల నుంచి ఎల్‌.జె.డి. న్యాయకళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. మరోవైపు, కళాశాల యాజమాన్యం మే 31న నూతన డ్రెస్‌కోడ్‌ జారీచేసింది. దాని ప్రకారం హిజాబ్‌ ధరించరాదని యాజమాన్యం సాంజిదాను ఆదేశించడంతో ఆమె జూన్‌ ఐదో తేదీన రాజీనామా చేశారు. యాజమాన్యం ఆదేశం తన మతపరమైన భావాలు, విలువలకు విరుద్ధంగా ఉండడమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కడం వివాదం చెలరేగింది. కేవలం సమాచార లోపం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, మంగళవారం నుంచి ఆమె తరగతులకు హాజరు కానున్నారని సోమవారం ప్రకటించింది. కళాశాల యాజమాన్యం నుంచి సోమవారం తనకు ఈమెయిల్‌ వచ్చిందని సాంజిదా చెప్పారు. ‘‘హెడ్‌స్కార్ఫ్‌ లేదా దుపట్టాతో తన తలను కప్పుకొని తరగతులు తీసుకోవాలని నాకు చెప్పారు. కానీ, నేను వెంటనే కళాశాలలకు వెళ్లడం లేదు. పరిస్థితులను విశ్లేషించుకుని, నా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు వారం రోజుల సమయం కోరాను’’ అని వెల్లడించారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన కళాశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ గోపాల్‌దాస్‌.. ఆమె తుది నిర్ణయం కోసం వెచిచూస్తున్నామని చెప్పారు. ‘‘వారం రోజుల్లో ఉపాధ్యాయురాలి నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే.. మరికొన్ని ఆమె రోజులు సెలవులు పొడిగిస్తాం. అప్పటికీ మార్పు లేకుంటే రాజీనామాను ఆమోదించినట్లు ఆమెకు తెలియజేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువ రోజులు అనిశ్చితిని కొనసాగించలేం’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని