ట్యాంకర్‌ మాఫియాపై ఏం చర్యలు తీసుకున్నారు?

దేశ రాజధాని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్‌ మాఫియా కట్టడికి, నీటి వృథా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

Published : 13 Jun 2024 06:21 IST

నీటి సంక్షోభంపై దిల్లీ సర్కారును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీలో తాగునీటి సంక్షోభం నేపథ్యంలో చాణక్యపురి ప్రాంతంలో ట్యాంకర్‌ను చుట్టుముట్టిన స్థానికులు

 దిల్లీ: దేశ రాజధాని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్‌ మాఫియా కట్టడికి, నీటి వృథా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ‘ట్యాంకర్‌ మాఫియాకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతే చెప్పండి. చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశిస్తాం’ అని జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ప్రసన్న బి వరాలేలతో కూడిన సెలవుకాల ధర్మాసనం మండిపడింది. ట్యాంకర్లలో రవాణా చేయగలిగినప్పుడు అదే నీటిని పైప్‌లైన్ల ద్వారా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారంటూ చురకలు వేసింది. ‘‘హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి దిల్లీకి నదీ జలాలు విడుదలవుతున్నా కోర్టుకు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? నగరానికి వస్తున్న నీళ్లన్నీ ఏమవుతున్నాయి? నీటిని వృథా చేస్తున్నారని, ట్యాంకర్‌ మాఫియా రెచ్చిపోతోందనే అంశాలను వార్తా ఛానళ్లలో చూస్తున్నాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’’ అంటూ ఆప్‌ ప్రభుత్వంపై ధర్మాసనం ధ్వజమెత్తింది. హిమాచల్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని