ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు.

Published : 13 Jun 2024 06:19 IST

24 ఏళ్ల క్రితం కేసులో తాజా పరిణామం

దిల్లీ: దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, ప్రజల ఐకమత్యం, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్య కావడంతో ఆమె క్షమాభిక్షకు అంగీకరించలేదని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు బుధవారం వెల్లడించాయి. డిసెంబరు 22, 2000లో దిల్లీలోని ఎర్రకోట వద్ద పహారా కాస్తున్న వారిపై.. పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం నిందితుల్లో ఒకరైన మహమ్మద్‌ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. పలు విచారణల అనంతరం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబాకు చెందిన ఆరిఫ్‌కు ఉరిశిక్ష విధిస్తూ 2005 అక్టోబరులో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును 2007లో దిల్లీ హైకోర్టు, 2011లో సుప్రీం కోర్టులు సమర్థించాయి. అనంతరం నిందితుడు పలు అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. చివరి యత్నంగా క్షమాభిక్ష కోరుతూ మే 15న రాష్ట్రపతికి దరఖాస్తు చేయగా.. మే 27న ఆమె తిరస్కరించారు. రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షమాభిక్ష తిరస్కరించడం ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని