సంక్షిప్త వార్తలు (5)

హనుమాన్‌ చాలీసా పారాయణ వివాదానికి సంబంధించిన కేసు విచారణకు భాజపా నాయకురాలు నవనీత్‌ రాణా న్యాయస్థానం ముందు బుధవారం హాజరుకాలేదు. ఈ కేసులో సహా నిందితుడైన నవనీత్‌ భర్త, అమరావతి ఎమ్మెల్యే రవి రాణా మాత్రం విచారణకు హాజరయ్యారు.

Published : 13 Jun 2024 05:50 IST

హనుమాన్‌ చాలీసా పారాయణ కేసు విచారణకు నవనీత్‌ రాణా గైర్హాజరు

ముంబయి: హనుమాన్‌ చాలీసా పారాయణ వివాదానికి సంబంధించిన కేసు విచారణకు భాజపా నాయకురాలు నవనీత్‌ రాణా న్యాయస్థానం ముందు బుధవారం హాజరుకాలేదు. ఈ కేసులో సహా నిందితుడైన నవనీత్‌ భర్త, అమరావతి ఎమ్మెల్యే రవి రాణా మాత్రం విచారణకు హాజరయ్యారు. ఆనారోగ్యం కారణంగా నవనీత్‌ రాణా విచారణకు రాలేకపోయారని ఆమె తరఫు న్యాయవాది షబ్బీర్‌ షోరా కోర్టుకు తెలిపారు. తమ అభ్యర్థనను అనుమతించిన కోర్టు ఈ కేసును జులై 2కు వాయిదా వేసింది. నవనీత్‌ దంపతులు 2022 ఏప్రిల్‌లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామని సవాల్‌ విసరడంతో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.


ఎన్నికల్లో వెయ్యి గంటల వాయు‘సేవ’

దిల్లీ: ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మారుమూల ప్రాంతాలకు సైతం తరలించడం ద్వారా భారత వాయుసేన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి 1,000 గంటల సేపు శ్రమించి.. 1,750 సార్లు హెలికాప్టర్లను నడిపామని వాయుసేన బుధవారం తెలిపింది. ఎంఐ-17, చేతక్, ధ్రువ్‌ హెలికాప్టర్లను ఎన్నికల విధుల్లో వినియోగించినట్లు వివరించింది. గతంలోనూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి వాయుసేన తోడ్పడింది.


యువతకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం 

- వారెన్‌ బఫెట్, బెర్క్‌షైర్‌ హాత్వే ఛైర్‌పర్సన్‌

యువతకు ఎన్ని నైపుణ్యాలున్నా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోతే నేటి పోటీ ప్రపంచంలో వెనుకబడే పరిస్థితి ఉంది. నాకు 20 ఏళ్లు వచ్చేవరకూ నలుగురి ముందు మాట్లాడాలంటే ఒళ్లంతా చెమటలు పట్టేవి. ఆ భయంతోనే తరగతి గదిలో అందరి ముందు మాట్లాడే అవసరం లేని కోర్సులనే ఎంచుకున్నాను. అయితే కాలేజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఎంత ముఖ్యమో అర్థమైంది. 100 డాలర్లు ఫీజు కట్టి మరీ పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులో చేరాను. అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. ఆ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కొంతకాలం టీచర్‌గా పనిచేశాను. ఉన్నత అవకాశాలు పొందడానికి, సంపాదనకూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం.


మోదీ భక్తులు ఆరెస్సెస్‌ చీఫ్‌నూ తప్పుపడతారా?

- కపిల్‌ సిబల్, రాజ్యసభ ఎంపీ 

మణిపుర్‌లో తీవ్ర హింస కొనసాగుతుంటే ప్రధాని మోదీ అక్కడికి ఎందుకు వెళ్లలేదని నేను ప్రశ్నించినప్పుడు ఆయన్ను గుడ్డిగా ఆరాధించే భక్తులు  నన్ను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.    అంతేకాదు.. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజాసమస్యలపై చర్చించకుండా వారి గొంతు నొక్కివేయొద్దని, సామాజిక అశాంతి ఆందోళనకర స్థాయిలో ఉందని, అహంకారం పనికిరాదని, మీరు వాడుతున్న భాష ఆమోదయోగ్యం కాదని చెప్పినప్పుడూ దూషణలకు దిగారు. ఇప్పుడు అవే మాటలను ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు. మరి ఆయన్ను కూడా భాజపా అంధ భక్తులు తప్పుపడతారా?


సిక్కు మిలిటెంట్లను ప్రోత్సహిస్తున్న కెనడా ప్రభుత్వం 

 బ్రహ్మ చెలాని, విదేశీ వ్యవహారాల నిపుణులు

కెనడాలోని ట్రూడో ప్రభుత్వం ఇప్పటికీ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్న సిక్కు మిలిటెంట్లను ప్రోత్సహిస్తూనే ఉంది. దోషులుగా తేలిన లేదా సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదులను వారు అమరవీరులుగా కీర్తిస్తున్నారు. ఇందిరా గాంధీ హత్య ఘటనను వీధి నాటకంగా ప్రదర్శిస్తున్నారు. భారత దౌత్యవేత్తలను చంపాలంటూ బిల్‌బోర్డులపై ప్రకటనలిస్తున్నారు. భారత్‌ నుంచి ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలని వారు నినాదాలు చేస్తుంటే, ట్రూడో అంగీకారం తెలుపుతున్నట్లు నవ్వులు చిందిస్తున్నారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంగ్లండ్‌లోని జాన్‌ వెట్‌గిఫ్ట్‌ అకాడమీలో
సైన్స్‌ విద్యార్థులతో ముచ్చటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని