ఆర్సెనిక్‌ను వడకట్టడం ఇక సులువు

భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్‌ వంటి భారలోహ కాలుష్యకారకాలను వడకట్టేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.

Published : 13 Jun 2024 05:56 IST

కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

బెంగళూరు: భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్‌ వంటి భారలోహ కాలుష్యకారకాలను వడకట్టేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది పర్యావరణ అనుకూల విధానమని వారు తెలిపారు.భారత్‌లోని 223 జిల్లాల్లో ఆర్సెనిక్‌ స్థాయి లీటరుకు 1.5 మిల్లీగ్రాముల మేర ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన పరిమితి కన్నా ఇది చాలా ఎక్కువ. దీనివల్ల మానవులు, జంతువుల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. ఆర్సెనిక్‌ను వడకట్టి, శుద్ధమైన తాగునీటిని అందించే పరిజ్ఞానాలు ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే నీటి నుంచి వేరుచేశాక ఆ విషతుల్య పదార్థాన్ని ఎక్కడ పడేయాలన్నదే ఇక్కడ కీలకం. అది తిరిగి పర్యావరణంలోకి ప్రవేశించకుండా చూడాలి. ప్రస్తుతమున్న విధానాల్లో ఈ అంశం కొరవడుతోంది. వడకట్టిన ఆర్సెనిక్‌ను నేలలో పూడ్చిపెట్టడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల మళ్లీ అది భూగర్భ జలాల్లోకి చేరుతోంది. ఈ సమస్యను ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు పరిష్కరించారు. వడకట్టిన ఆర్సెనిక్‌ను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వదిలించుకోవడానికి వారు రూపొందించిన విధానం ఉపయోగపడుతుంది. ఇందులో మూడు అంచెలు ఉంటాయి. ఈ పద్ధతిలో వెలువడే విషతుల్య అకర్బన ఆర్సెనిక్‌ను.. విషతుల్యత పెద్దగా లేని సేంద్రియ ఆర్సెనిక్‌గా మారుస్తారు. ఇందుకోసం ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవుల సాయంతో మిథైలేషన్‌ అనే ప్రక్రియను చేపడతారు. 8 రోజుల్లోనే ఇది పూర్తవుతుంది. దీన్ని సురక్షితంగా గోతుల్లో పూడ్చిపెట్టవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని