4 దశాబ్దాల్లో 40 శాతం పెరిగిన నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు

పుడమిని వేడెక్కించే నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు.. 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉందని తెలిపింది.

Published : 13 Jun 2024 05:57 IST

దిల్లీ: పుడమిని వేడెక్కించే నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు.. 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉందని తెలిపింది. భారత్, అమెరికాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరించింది. కార్బన్‌ డైఆక్సైడ్, మిథేన్‌ తర్వాత పుడిమిని ఎక్కువగా వేడెక్కిస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా ఉంది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగింది. ఇందులో మానవ చర్యలతో వెలువడ్డ నైట్రస్‌ ఆక్సైడ్‌ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీల సెల్సియస్‌గా అంచనా వేస్తున్నారు.  గడిచిన దశాబ్ద కాలంలో వాతావరణంలోకి చేరిన ఈ వాయు ఉద్గారాల్లో 74 శాతం.. నత్రజని ఎరువులు, వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఎరువుల నుంచే వచ్చాయి. 2022లో వాతావరణంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ గాఢత 336 పార్ట్స్‌ పర్‌ బిలియన్‌కు పెరిగింది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇది 25 శాతం అధికం. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువకు పరిమితం చేయాలంటే.. 2019 నాటితో పోలిస్తే 2050 నాటికి మానవ చర్యలతో వెలువడే నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు కనీసం 20 శాతం తగ్గాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ వాయువు విడుదలను తగ్గించడమే మార్గమని, వాతావరణం నుంచి తొలగించే పరిజ్ఞానమేదీ ప్రస్తుతం అందుబాటులో లేదని వారు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని