సంక్షిప్త వార్తలు (5)

ఇంజినీరింగ్‌లో, అందులోనూ ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతుండటం శుభపరిణామం. 2017లో 995 మంది అమ్మాయిలు ఐఐటీల్లో చేరగా, 2023 నాటికి ఆ సంఖ్య 3,411కు చేరింది.

Updated : 14 Jun 2024 06:09 IST

ఐఐటీల్లో పెరుగుతున్న అమ్మాయిల ప్రవేశాలు
అనుష్క సోహమ్‌ బథ్వాల్, పాత్రికేయురాలు

ఇంజినీరింగ్‌లో, అందులోనూ ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతుండటం శుభపరిణామం. 2017లో 995 మంది అమ్మాయిలు ఐఐటీల్లో చేరగా, 2023 నాటికి ఆ సంఖ్య 3,411కు చేరింది. అయితే అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం వారికి ప్రతిభ లేకపోవడం కాదు, సమాన అవకాశాలు దక్కకపోవడం. కుటుంబం నుంచే వారికి వివక్ష ఎదురవుతోంది. తల్లిదండ్రులు ఫీజులు కట్టి ఆడపిల్లలకు జేఈఈ శిక్షణ ఇప్పించడానికి సిద్ధపడటం లేదు. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేకపోవడం వల్ల జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అమ్మాయిలు చాలా మంది ఐఐటీల్లో చేరడం లేదు. 


జీవ వైవిధ్యం దిశగా తమిళనాడు కృషి భేష్‌
సుప్రియా సాహు, తమిళనాడు పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి 

జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నది మానవులే కాబట్టి దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. ఆలివ్‌ రిడ్లీ సముద్ర తాబేళ్ల పరిరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ ఏటా ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈసారి మేం తాబేళ్ల గుడ్ల సంరక్షణ కోసం 8 జిల్లాల్లో 53 హేచరీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 122 మంది సిబ్బంది, వందల మంది వాలంటీర్లు రాత్రుళ్లు సముద్ర తీరాలను జల్లెడపట్టి 2,58,775 తాబేలు గుడ్లను సేకరించారు. వాటిని జాగ్రత్తగా పరిరక్షించిన అనంతరం 2,15,778 తాబేలు పిల్లలను సముద్ర జలాల్లో వదిలిపెట్టాం. గతేడాదితో పోలిస్తే మేము సముద్రంలోకి వదిలిన తాబేలు పిల్లల సంఖ్య 33 వేలు అధికం. 


ధూమపానం మానేస్తే ఎన్నో ప్రయోజనాలు
- ఉమా కుమార్, దిల్లీ ఎయిమ్స్‌ వైద్య నిపుణురాలు

పొగ తాగడం మానేసిన వెంటనే శరీరంలో శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. దీని ప్రయోజనాలు వెనువెంటనే కనిపించడం మొదలవుతుంది. 20 నిమిషాల్లో మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు స్థిరంగా మారుతాయి. 24 గంటల్లో రక్తంలోని కార్బన్‌ మోనాక్సైడ్‌ సాధారణ స్థాయికి చేరుతుంది. కొన్ని నెలల్లో ఊపిరితిత్తుల పనితీరు 10 శాతం మేర మెరుగుపడుతుంది. సంవత్సరంలో గుండె పోటు ముప్పు, 2-5 ఏళ్లలోపు నోరు, గొంతు క్యాన్సర్ల ముప్పు, 10 ఏళ్ల తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం సగానికి తగ్గుతాయి.


బిన్సార్‌ అభయారణ్యంలో అగ్నిప్రమాదం
నలుగురు అటవీ సిబ్బంది మృతి

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సివిల్‌ సోయం అటవీ డివిజన్‌కు చెందిన బిన్సార్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో నలుగురు అటవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు. మృతులను బిన్సార్‌ రేంజి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ త్రిలోక్‌ సింగ్‌ మెహతా, ఫైర్‌ వాచర్‌ కరణ్‌ ఆర్య, జవాన్‌ పురన్‌ సింగ్, దినసరి కూలీ దివాన్‌ రాంలుగా గుర్తించారు. అభయారణ్యంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ఎనిమిది మంది అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 


వేడి గాలులతో హరియాణా, పంజాబ్‌ విలవిల

చండీగఢ్, శిమ్లా: హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలు గురువారం తీవ్ర వేడిగాలుల ప్రభావంతో విలవిల్లాడాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్‌లో 46.8, రోహ్‌తక్‌లో 46.5, సిర్సాలో 46.2, హిస్సార్‌లో 45.6, మహేంద్రగఢ్‌లో 45, చండీగఢ్‌లో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అలాగే గురుగ్రామ్‌ (45.8), అంబాలా (45.3), కర్నాల్‌ (44.4), నూహ్‌ (45.8), కురుక్షేత్ర (44.8), పంచకుల (43.8) ప్రాంతాలు అధిక వేడితో అల్లాడాయి. పొరుగున పంజాబ్‌లో 44, బఠిండా ఎయిర్‌పోర్టులో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని