ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్‌’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్‌?

చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్‌ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారని భాజపా వ్యాఖ్యానించింది.

Published : 15 Jun 2024 00:11 IST

బెంగళూరు: అభిమాని హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌.. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని విపక్ష భాజపా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మరో అంశాన్ని తెరమీదకు తెచ్చింది. చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్‌ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం విస్తృత ప్రచారం చేసిన ఆ నటుడిని ఎన్నికల బరిలో నిలపాలని డీకే సోదరులు ప్రణాళిక వేశారు. వాళ్ల అనూహ్య అభ్యర్థి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. వాళ్లు రంగంలోకి దింపాలనుకున్న వ్యక్తి ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇప్పుడు ఆయన్ను పోటీలో నిలపడం సాధ్యం కాదు. దీంతో మరో ఊహించని వ్యక్తి కోసం వాళ్లు ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఆయన ఎవరైనా.. భాజపా, జేడీఎస్‌లు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి’’ అని భాజపా నేత, ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ పేర్కొన్నారు. ఎవరూ ఊహించని వ్యక్తిని ఉప ఎన్నికలో నిలబెడతామని డీకే సురేశ్‌ ఇటీవల చేసిన ప్రకటనపై యోగేశ్వర్‌ ఈవిధంగా స్పందించారు. అయితే, ఆ నటుడి కేసు గురించి తానేమీ వ్యాఖ్యానించనని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపారని భాజపా నేత పేర్కొన్నారు.

దర్శన్‌కు చెప్పి పొరపాటు చేశా.. పవిత్రగౌడ కన్నీరుమున్నీరు

ఎమ్మెల్యేగా ఉన్న జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. దాంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ క్రమంలోనే అక్కడినుంచి కాంగ్రెస్‌ తరఫున దర్శన్‌ను పోటీ చేయించాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఆయన సోదరుడు డీకే సురేశ్‌లు ప్రణాళిక వేసినట్లు భాజపా చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు