సంక్షిప్త వార్తలు (11 )

ఒడిశా సీఎంగా ఎన్నికైన భాజపా నేత మోహన్‌ చరణ మాఝి మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటికి స్వయంగా వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనల కోసం అభ్యర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

Updated : 15 Jun 2024 06:05 IST

ఒడిశా రాజకీయం.. ఆదర్శప్రాయం
- అమిష్‌ త్రిపాఠి, రచయిత

ఒడిశా సీఎంగా ఎన్నికైన భాజపా నేత మోహన్‌ చరణ మాఝి మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటికి స్వయంగా వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనల కోసం అభ్యర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తున్న నేటి భారత రాజకీయాల్లో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మారాయి. నవీన్‌ పట్నాయక్‌ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరై హుందాగా వ్యవహరించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. ఆ రాష్ట్రంలో ఫలితాల తర్వాత ఓడినవారెవరూ ఈవీఎంలను నిందించలేదు. ప్రత్యర్థులపై దాడులకు దిగలేదు, దుర్భాషలాడలేదు. రాజకీయ నేతలు దీన్ని చూసి నేర్చుకోవాలి.


మన నమస్తే.. ఎప్పుడో విశ్వవ్యాప్తం
- అమిత్‌ శాండిలియా, రచయిత

జీ-7 సదస్సుకు విచ్చేసిన ప్రముఖులకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం చేయడాన్ని చూసి భారతీయులు తమ దేశ సంస్కృతి విశ్వవ్యాప్తమైందని గర్వపడుతున్నారు. అయితే ఈ నమస్తే సంజ్ఞ కొన్ని వందల ఏళ్ల క్రితమే ప్రపంచానికి పరిచయమైంది. హరప్పా నాగరికత సమయంలోనే చేతులు జోడించి అభివాదం చేసుకొనే సంప్రదాయం మొదలైంది. జర్మన్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆల్బ్రెక్ట్‌ డురెర్‌ 500 ఏళ్ల క్రితమే జోడించిన చేతుల చిత్రాన్ని గీశారు. అభివాదం విషయంలో వినమ్రత, పరిశుభ్రత, నాగరికత కలగలిసిన నమస్తేను మించింది లేదు.


రాజకీయ అవకాశాల్లో మహిళలపై చిన్నచూపు
- రక్షా కుమార్, పాత్రికేయురాలు

పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 1952లో 4.4 శాతం ఉండగా, 2024 నాటికి 13 శాతానికి పెరిగింది. ఇది పురోగతిలా కనిపిస్తున్నా అది నిజం కాదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది  అభ్యర్థులు బరిలో నిలవగా, వారిలో 797 మంది మహిళలు(సుమారు 10 శాతం) మాత్రమే ఉన్నారు. ఓటర్లలో 48 శాతం మహిళలు ఉన్నా, రాజకీయ అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో దక్కడం లేదు. మహిళల సామర్థ్యం పట్ల రాజకీయ పార్టీల దృక్పథం మారాలి.


మెదడుకు, మనసుకూ కసరత్తులు అవసరం
- హర్ష్‌ గోయెంకా, వ్యాపారవేత్త

శరీరానికే కాదు.. మెదడుకు, మనసుకు కూడా కసరత్తులు అవసరం. దృఢమైన కండరాల కోసం బరువులు ఎత్తండి. గుండె పోటు ముప్పును తగ్గించుకోవడానికి కార్డియో ఎక్సర్‌సైజులు చేయండి. అలాగే జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదవండి. ఆలోచనలను సృజించడానికి, భావాలను వ్యక్తీకరించడానికి డైరీ రాయడాన్ని అలవాటు చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ప్రకృతిలో గడపండి. ధ్యానం చేయండి. కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోండి. ఇవన్నీ పాటించినవారు పరిపూర్ణ మానవులుగా మారుతారు.


పన్ను విధానాలను సంస్కరించాలి
- శేఖర్‌ కపూర్, సినీ దర్శకుడు

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా పన్ను విధానాలను సంస్కరించాలి. కంపెనీలు లాభాలు ఆర్జించడం మంచిదే. అయితే భూగ్రహంలోని ఎన్ని వనరులను, ఎంత మేర వినియోగించి ఆ లాభాలు పొందాయన్న విషయాన్ని తేల్చడం కీలకం. దాన్ని బట్టే పన్నుల విధింపు ఉండాలి. ఎక్కువ వనరులు వినియోగించిన సంస్థలకు పన్నులు పెంచాలి.


300 మంది మహిళా శాస్త్రవేత్తలు రీసెర్చి గ్రాంట్‌

దిల్లీ: సీఎస్‌ఐఆర్‌-ఆస్పైర్‌ పథకంలో భాగంగా మొత్తం 300 మంది మహిళా శాస్త్రవేత్తలకు మూడేళ్లపాటు రీసెర్చి గ్రాంట్‌ మంజూరైందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి(డీఎస్‌ఐఆర్‌) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవిష్కరణలు సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలన్నారు. రీసెర్చి గ్రాంట్‌ మంజూరు కోరుతూ దేశవ్యాప్తంగా దాదాపు మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయనీ, మహిళా శాస్త్రవేత్తలకు మోదీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో ఈ సంఖ్య తెలియజేస్తోందన్నారు. అనేక వడపోతల అనంతరం 301 దరఖాస్తులను ఆమోదించామని ఆయన వెల్లడించారు. ‘సీవీడ్‌ మిషన్‌’ను మరింత వేగవంతం చేయాలన్నారు. 


కాంగ్రెస్‌ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేశ్, ఖేడాలపై పరువు నష్టం కేసు

దిల్లీ: కాంగ్రెస్‌ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేశ్, పవన్‌ ఖేడాలపై సీనియర్‌ పాత్రికేయుడు రజత్‌ శర్మ దిల్లీ హైకోర్టులో శుక్రవారం పరువు నష్టం దావా వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున తాను నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి అభ్యంతరకర భాషను ఉపయోగించారంటూ ఆయన ఆరోపించారు. తన కక్షిదారును కించపరిచేలా వారు చేసిన ట్వీట్లు, సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోలను తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ శర్మ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయనకు వ్యతిరేకంగా రాజకీయ నేతలెవరూ ఆరోపణలు చేయకుండానూ అడ్డుకోవాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ సెలవుకాల ధర్మాసనం తన ఆదేశాలను వాయిదా వేసింది. 


మురిగిపోయిన జలవివాదాల పరిష్కార బిల్లు

దిల్లీ: లోకసభ ఆమోదం పొంది 2019 నుంచి రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న జలవివాదాల పరిష్కార బిల్లు 17వ లోక్‌సభ రద్దు కావడంతో మురిగిపోయింది. అంతర్‌రాష్ట్ర నదులు, నదీపరీవాహక ప్రాంతాలకు సంబంధించి తలెత్తే వివాదాలకు పరిష్కారాలు చూపడమే బిల్లు ముఖ్యఉద్దేశం. 


ఉపా కింద అరుంధతీరాయ్‌ విచారణకు అనుమతించిన దిల్లీ ఎల్జీ 

దిల్లీ: ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కశ్మీర్‌కు చెందిన మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌లను ‘ఉపా’ చట్టం కింద విచారించేందుకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అనుమతులిచ్చారు. 2010లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అభియోగాలతో ఇప్పటికే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 


గవర్నర్‌ను సువేందు కలవొచ్చు: హైకోర్టు

కోల్‌కతా: ఎన్నికల అనంతరం జరిగిన దాడుల బాధితులతో కలిసి పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు కలకత్తా హైకోర్టు అనుమతిచ్చింది. ‘గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతి ఉంటే సువేందు, బాధితులు.. గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ను కలవొచ్చు’ అని జస్టిస్‌ అమృతా సిన్హా శుక్రవారం తీర్పు ఇచ్చారు. అనుమతి ఉన్నా రాజ్‌భవన్‌లో ప్రవేశించకుండా తమను పోలీసులు అడ్డుకున్నారని సువేందుతోపాటు మరో వ్యక్తి గురువారం హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. అనుమతి ఉన్నా బాధితుల్ని ఏ కారణాలతో తనను కలవకుండా అడ్డుకున్నారో తెలపాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్‌ ఆనందబోస్‌  లేఖ రాశారు.


రూ.4,440 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో పరారీలో ఉన్న ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన రూ.4,440 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ తెలిపింది. సహరణ్‌పూర్‌ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, అతడి కుటుంబ సభ్యులపై ఈడీ గతంలో మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఐటీ రిటర్నుల్లోనూ ఆదాయం తక్కువ చూపినట్లు ఈడీ పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని