అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం

పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

Published : 15 Jun 2024 06:20 IST

కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ 

దిల్లీ: పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణపై వివాదం చెలరేగుతుండటంతో శుక్రవారం మంత్రి ఈ వివరణ ఇచ్చారు. ఆరు కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వడంలో తలెత్తిన లోపాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘అన్ని కోణాలనూ పరిశీలిస్తాం. జరిగిన తప్పును బట్టి జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తాం’’ అని చెప్పారు. నీట్‌పై వివిధ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. విద్యార్థులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిలబస్‌ తక్కువగా ఉండటం.. భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాయడంతో పోటీ పెరిగి ఎక్కువ మంది టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారని అన్నారు. నీట్‌ పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు. ‘‘నీట్‌కు సంబంధించిన వాస్తవాలు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నీట్‌ పేపర్‌ లీక్‌ అయిందని నిరూపించడానికి సాక్ష్యాలు లేవు. కేవలం ఆరు కేంద్రాల్లో ప్రశ్నపత్రం సరిగా ఇవ్వకపోవడాన్ని కారణంగా చూపించి మొత్తం వ్యవస్థ పవిత్రతను, విశ్వసనీయతను ప్రశ్నించలేం’’ అని ప్రధాన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని