అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది

యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు.

Updated : 15 Jun 2024 06:13 IST

జమ్మూ ఉగ్రదాడిలో గాయపడిన మహిళ వెల్లడి  

గోండా: యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. ఈ నెల 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. దాడి నుంచి తప్పించే క్రమంలో వాహనం లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా జమ్మూలో చికిత్స తీసుకున్న అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నీలం ఆరోజు జరిగిన సంఘటనను శుక్రవారం వివరించారు. కాల్పుల సమయంలో తాను కూడా బస్సులోనే ఉన్నాననీ, లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు పైనుంచే తూటాల వర్షం కురిపించారన్నారు. వారి తీరు చూస్తుంటే.. అందర్నీ చంపేయాలనే కసి ఉన్నట్లు కనిపించిందని ఆమె పేర్కొన్నారు. 


కశ్మీరీ పండిత్‌లు తిరిగి వచ్చేయాలి: మిర్వాజ్‌ ఉమర్‌

శ్రీనగర్‌: బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించే సమయం ఆసన్నమైందనీ.. స్వస్థలాలను విడిచి వెళ్లిన కశ్మీర్‌ పండిత్‌లు తిరిగి వెనక్కి వచ్చేయాలని హురియత్‌ కాన్ఫెరెన్స్‌ ఛైర్మన్‌ మిర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ కోరారు. ఏటా మాదిరి మాతా ఖీర్‌ భవానీ ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కొందరు కశ్మీరీ పండిత్‌లను సత్కరించారు. ఇటీవల పుల్వామా జిల్లాలో పోలీసు కస్టడీలో యువకుడు మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


కశ్మీర్‌పై అమిత్‌ షా సమీక్ష

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో శుక్రవారం అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్షించారు. గత నాలుగు రోజుల్లో రియాసీ, కఠువా, డోడా జిల్లాల్లోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి తొమ్మిది మంది యాత్రికులను, ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ఉన్నతాధికారులు.. షాకు వివరించారు. దీంతో ఆదివారం కశ్మీర్‌పై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు షా సూచించారు. ఈ భేటీలో జాతీయ భద్రతాసలహాదారు అజీత్‌ డోభాల్, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని