భాజపాతో ఆరెస్సెస్‌కు విభేదాల్లేవు.. సంఘ్‌ వర్గాల వెల్లడి

భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి.

Published : 15 Jun 2024 06:14 IST

దిల్లీ: భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. భాగవత్‌ తాజా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడంతో గందరగోళం నెలకొందని తెలిపాయి. భాగవత్‌ పేర్కొన్న ‘అహంకారం’ అన్న మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాని ఇతర భాజపా నేతలను ఉద్దేశించి చేయలేదని వివరించింది. ‘నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’ అంటూ ఇటీవల భాగవత్‌ నాగ్‌పుర్‌లో సంఘ్‌ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే మణిపుర్‌లో ఏడాది కాలంగా హింస రగులుతుండడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో భాజపా, ఆరెస్సెస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ పెద్దఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. 

నేడు భాగవత్‌తో యూపీ సీఎం యోగి భేటీ!

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 15న సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరెస్సెస్‌ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. భాజపాపై ఆరెస్సెస్‌ ఆగ్రహంతో ఉందన్న కథనాల నేపథ్యంలో యోగి, భాగవత్‌ల మధ్య భేటీ జరగనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని