సంక్షిప్త వార్తలు (5)

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని ఒంటరితనం కమ్మేస్తోంది. వృత్తి, వయసు, సంపాదన ఇత్యాది కారణాలతో నిమిత్తం లేకుండా ఎంతోమంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

Updated : 16 Jun 2024 05:51 IST

ప్రపంచాన్ని కమ్మేస్తున్న ఒంటరితనం
హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ వెబ్‌సైట్‌

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని ఒంటరితనం కమ్మేస్తోంది. వృత్తి, వయసు, సంపాదన ఇత్యాది కారణాలతో నిమిత్తం లేకుండా ఎంతోమంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. సమాజంలో పేరుప్రతిష్ఠలున్న వైద్యులు, న్యాయవాదులు ఎక్కువగా ఒంటరితనం బారిన పడుతున్నట్లు వెల్లడైంది. వారిలో ఎక్కువ మంది మత విశ్వాసాలు లేనివారు, అవివాహితులు, సంతానం లేని వారు ఉన్నారు. ఉద్యోగుల్లో ఒంటరితనం వల్ల వారి పనితీరుపైనా ప్రతికూల ప్రభావం పడి మొత్తంగా సంస్థల ఉత్పాదకత దెబ్బతింటోంది. ఈ నష్టం కొన్ని వందల కోట్ల డాలర్లు కావడం గమనార్హం. రోజూ 15 సిగరెట్లు కాలిస్తే ఆరోగ్యంపై ఎంత దుష్ప్రభావం పడుతుందో, ఒంటరితనం వల్ల కూడా అదే స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని అధ్యయనకర్తలు తేల్చారు. ఒంటరితనం మహమ్మారిని గుర్తించిన బ్రిటన్‌ ప్రభుత్వం బాధితుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఇతర దేశాలు కూడా తగు చర్యలు చేపట్టాలి.


భారత్‌ విశ్వగురువా లేక విశ్వకూలీనా?

- రాజీవ్‌ మల్హోత్రా, వర్తమాన వ్యవహారాల విశ్లేషకులు

ఉన్నత విద్య చదివేందుకు అమెరికా  బాటపడుతున్న మన దేశ విద్యార్థుల సంఖ్య ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. గతేడాది 1.4 లక్షల మంది   భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు మంజూరు చేసింది. 2018-2020 మధ్య జారీ చేసిన మొత్తం వీసాల సంఖ్య కన్నా ఇది ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం అగ్రరాజ్యంలోని ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయులే. తమ పిల్లల్ని   అమెరికాలో చదివించేందుకు భారతీయులు ఏటా వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత్‌లో అథమ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాల ప్రమాణాలే. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్‌ విశ్వ గురువు అవుతుందా లేక విశ్వ కూలీగా మారుతుందా అన్నది ఆలోచించుకోవాలి. 


ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థ అత్యుత్తమం

- వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం

ప్రపంచంలో ఫిన్లాండ్‌ ఉత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా ప్రత్యేకత చాటుకుంటోంది. అక్కడ విద్యావకాశాలు అందరికీ ఉచితంగా, సమానంగా దక్కేలా రాజ్యాంగ హక్కు కల్పించారు. ఏడేళ్లు పూర్తయ్యేవరకూ పిల్లలు పాఠశాలలో     చేరాల్సిన అవసరం ఉండదు. తద్వారా వారు బాల్యాన్ని ఆటలతో ఆనందంగా  గడపొచ్చు. ప్రీప్రైమరీ స్కూళ్లలో ఆడుకుంటూ నేర్చుకొనే విధానం ఉంటుంది. హైస్కూల్‌ చదువు పూర్తి చేసే సమయంలో ఒకే ఒక్క ప్రామాణిక పరీక్ష ఉంటుంది. అక్కడ ఉపాధ్యాయ వృత్తిని అత్యంత గౌరవంగా భావిస్తారు. టీచర్లకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కనీస అర్హత. విద్యార్థులు వారంలో హోమ్‌వర్క్‌కు కేటాయించే సమయం 2.8 గంటలు మాత్రమే. అమెరికాలో అది 6.1 గంటలుగా ఉంది. 16 ఏళ్లు దాటాక విద్యను కొనసాగించాలా వద్దా అన్నది విద్యార్థుల ఆసక్తి మేరకే ఉంటుంది. అయితే 90 శాతం మంది పాఠశాల మానడానికి ఇష్టపడరు. కోర్సు మధ్యలో కూడా సబ్జెక్టులను మార్చుకొనే వెసులుబాటు ఉంటుంది. 


గుజరాత్‌లో విషాదం.. బోరుబావిలో పడి చిన్నారి మృతి

అమ్రేలీ: బోరుబావిలో పడి 18 నెలల చిన్నారి మృతిచెందిన విషాదకర ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా సూరజ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరోహి అనే చిన్నారి 500 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే సహాయక చర్యలు చేపట్టగా.. రాత్రి 10:20 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం వీరికి జత కలిసింది. చిన్నారి 50 అడుగుల లోతున చిక్కుకొన్నట్లు గుర్తించి, 108 అంబులెన్సు ద్వారా ఆక్సిజన్‌ అందిస్తూ వచ్చారు. దాదాపు 17 గంటలు శ్రమించి శనివారం ఉదయం 5.00 గంటల ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న పాపను బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 


కశ్మీర్‌ వేర్పాటువాద నేత షాబీర్‌ షాకు బెయిలు

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత షాబీర్‌ అహ్మద్‌ షాకు దిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులందించిన వ్యవహారంపై ఈ కేసు నమోదైంది. షాబీర్‌ షా ఇప్పటికే 6 సంవత్సరాల 10 నెలలపాటు జైల్లో ఉన్నారని, ఈ కేసులో గరిష్ఠ శిక్ష ఏడేళ్లని ఈ నెల 7వ తేదీన తీర్పు చెప్పిన అదనపు సెషన్స్‌ జడ్జి ధీరజ్‌ మోర్‌ పేర్కొన్నారు. ఆయనపై ఉన్న ఇతర తీవ్ర కేసులను బట్టి ఈ కేసులో బెయిలు నిరాకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో బెయిలు మంజూరైనా ఇతర కేసులు ఉన్నందున షాబీర్‌ షా జైలు నుంచి విడుదల కాలేదు. 2017 జులై 26వ తేదీ నుంచి అతడిని జైల్లో ఉంచారు. వచ్చే జులై 25వ తేదీ నాటికి గరిష్ఠంగా పడే శిక్షను అండర్‌ ట్రయల్‌గానే అతడు పూర్తి చేయనున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని