‘బంగళాల కోసం చెట్లను కొట్టనీయం’..

వీవీఐపీల బంగళాల నిర్మాణం కోసం కొట్టేస్తారని భావిస్తున్న 27 వేల చెట్ల సంరక్షణ కోసం భోపాల్‌లో వందలమంది ఆందోళనకారులు చేతులు కలిపారు.

Updated : 16 Jun 2024 06:36 IST

మధ్యప్రదేశ్‌లో హరిత పరిరక్షణ ఉద్యమం

భోపాల్‌: వీవీఐపీల బంగళాల నిర్మాణం కోసం కొట్టేస్తారని భావిస్తున్న 27 వేల చెట్ల సంరక్షణ కోసం భోపాల్‌లో వందలమంది ఆందోళనకారులు చేతులు కలిపారు. అవసరమైతే చిప్కో తరహా ఉద్యమానికి సిద్ధమంటున్నారు. అత్యంత పచ్చదనం ఉండే.. శివాజీ నగర్, తులసీ నగర్‌ ప్రాంతాల్లో చెట్లను కొట్టి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల కోసం బంగళాల్ని నిర్మించాలనుకుంటున్న ఎంపీ హౌసింగ్‌ బోర్డు ఆ ఆలోచనను విరమించుకోవాలంటూ.. గత పదిరోజులుగా నగరంలోని పౌరులు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఆందోళనలు చేపడుతున్నారు. నిరసనకారుల్లో అధిక సంఖ్యలో మహిళలతోపాటు భాజపా ఎమ్మెల్యే ఒకరున్నారు. వీరంతా శుక్రవారం ఆ చెట్లకు పూజలు చేసి, వాటిని హత్తుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలకొరగనీయమంటూ ప్రతిన బూనారు. ఇక్కడ బంగళాలను నిర్మించే ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముందు హౌసింగ్‌ బోర్డు ఉంచిందని, ప్రస్తుతానికి అది ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు తెలిపారు మధ్యప్రదేశ్‌ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి విభాగం ప్రధాన కార్యదర్శి నీరజ్‌ మండ్లోయి. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వనందున ఆ చెట్లకు ప్రస్తుతానికి ముప్పు లేదని ఆయన చెప్పారు. నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న వారిలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సుభాష్‌ సి.పాండే ఒకరు.. ‘మా ఆందోళనపై ప్రభుత్వ స్పందన గురించి వేచి చూస్తున్నాం, అదే సమయంలో దీన్ని చిప్కో తరహా ఉద్యమంగా తీసుకువెళ్లే దిశగా ఆలోచిస్తున్నామ’ని ఆయన తెలిపారు. గతంలో ఇక్కడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదన రాగా, ఇదే తరహా ఉద్యమం చేపట్టడంతో దాన్ని మరో ప్రాంతానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని