సంక్షిప్త వార్తలు (7)

ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు.

Updated : 17 Jun 2024 06:27 IST

తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమే మనల్ని నడిపిస్తుంది
- అనిల్‌ అగర్వాల్, వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌

ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. తన జీవితంలో ఎదురైన అడ్డంకులను, వాటిని అధిగమించిన తీరును నాకు వివరించారు. మా నాన్న మాటల వల్ల నా మనసులోని బాధ తగ్గలేదు కానీ, తను నా పక్కనే ఉన్నారన్న ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరాదన్న పట్టుదల కలిగింది. మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. అదే విషయాన్ని నేను నా పిల్లలకు చెప్పాను. తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది. కానీ వారు నేర్పిన సంస్కారం, జీవిత పాఠాలు, ఆశీస్సులు మన వెంటే ఉంటూ మనల్ని నడిపిస్తాయి. పిల్లలు పితృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రతిసారి, తండ్రులకు తమ తల్లిదండ్రులు గుర్తురాక మానరు.


ఉద్యోగాలున్నాయ్‌.. నైపుణ్యాలేవీ?
- ఆకాశ్‌ తివారి, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌

ఉద్యోగాలకు సంబంధించి దేశంలో వింత పరిస్థితి నెలకొంది. తమకు ఉద్యోగావకాశాలు లేవని ఓ వైపు నిరుద్యోగులు చెబుతుంటే, మరోవైపు కంపెనీలు తమకు సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదని చెబుతున్నాయి. తమ సంస్థలో 80 వేల ఖాళీలు ఉన్నాయని, కానీ ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న పట్టభద్రులు దొరక్కపోవడంతో వాటిని భర్తీ చేయలేకపోతున్నామని టీసీఎస్‌ వెల్లడించింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రస్తుత విద్యా వ్యవస్థే. మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వడం తప్ప ఉద్యోగ సంస్థల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సంసిద్ధం చేసే విధానం కొరవడింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు ఇతర నైపుణ్యాల శిక్షణ కోసం మళ్లీ కోర్సుల్లో చేరాల్సి వస్తోంది. ఉద్యోగ సంస్థల పర్యవేక్షణ, సహకారంతో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది.


రాజకీయ విలువలు నానాటికీ తీసికట్టు
-  కౌశిక్‌ బసు, భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు

భారతదేశ రాజకీయ విలువల పతనం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఎంపీలపై ఉన్న నేరాభియోగాలే అందుకు నిదర్శనం. 2014లో 34 శాతం మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉండగా, 2019 నాటికి అది 43 శాతానికి పెరిగింది. 2024లో ఏకంగా 46 శాతానికి చేరుకుంది. మన పౌరులకు మెరుగైన నాయకుల అవసరం ఉంది. అలాంటి వారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది. రాజకీయ సిద్ధాంతాలేవైనా పార్టీలు ఉత్తమ అభ్యర్థులను ప్రజల ముందు ఉంచాలి.


ఖనిజాల వెలికితీతపై అస్సాం సీఎంతో కిషన్‌ రెడ్డి భేటీ

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను వినియోగించుకోవడంపై తాము చర్చించినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. అస్సాంలోని ఖనిజాలను వెలికితీయడం కోసం ఈ ప్రాథమిక చర్చను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు ‘ఎక్స్‌’ వేదికగా కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 


ట్రాన్స్‌జెండర్లకు 1% రిజర్వేషన్‌ కల్పించండి
- బెంగాల్‌ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు ఒక శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు సమాన ప్రాతినిధ్యం ఇస్తానని రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించినా... ఇప్పటివరకు వారికి రిజర్వేషన్‌ను అమలు చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. తక్షణం ఒకశాతం రిజర్వేషన్‌ను అమలయ్యేలా చూడాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


గంగానదిలో బోటు బోల్తా.. నలుగురి గల్లంతు

పట్నా: బిహార్‌లోని గంగానదిలో 17 మందితో వెళ్తోన్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మరో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. పట్నా జిల్లా బాఢ్‌ సబ్‌ డివిజన్‌లో ఉమానాథ్‌ గంగా ఘాట్‌ సమీపంలో ఆదివారం ఉదయం 9:15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 


నాగ్‌పుర్‌ ఫ్యాక్టరీ పేలుడులో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పేలుడు పదార్థాల కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందని పోలీసు అధికారులు వెల్లడించారు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించగా తీవ్ర గాయాలపాలైన తొమ్మిది మందిని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోజే వారిలో ఆరుగురు మరణించగా తర్వాత ఇద్దరు, శనివారం రాత్రి మిగిలిన ఒకరు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు. వీరంతా ప్యాకేజింగ్‌ యూనిట్‌లో పని చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని