హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు

పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ తిరస్కరించారు.

Published : 17 Jun 2024 05:34 IST

విద్యార్థులకు వాటిని బోధించనక్కర్లేదు
పెద్దైన తర్వాత వారే తెలుసుకుంటారు
 బాబ్రీ మసీదు, గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన మార్పులపై ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ

దిల్లీ: పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ తిరస్కరించారు. గుజరాత్‌ అల్లర్లు, బాబ్రీమసీదు కూల్చివేత అంశాలపై ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో జరిగిన మార్పులపై సక్లానీ సమాధానమిస్తూ.. ‘‘అల్లర్ల గురించి పాఠశాలల్లో ఎందుకు బోధించాలి? మనం సానుకూల దృక్పథంతో ఆలోచించే పౌరులను తయారుచేయాలి తప్ప హింస, ఒత్తిడికి గురైన వారిని కాదు. చిన్న పిల్లలకు అల్లర్ల గురించి చెప్పక్కర్లేదు. పెరిగి పెద్దైన తర్వాత ఎందుకు జరిగాయి.. ఎలా జరిగాయి అన్న విషయాలను వారే అర్థం చేసుకుంటారు. ఏదో జరిగిపోతోందంటూ ప్రస్తుతం పుస్తకాల్లో జరుగుతున్న మార్పులు చేర్పులు గురించి ఆందోళన చెందడం అనవసరం’’ అని ఆయన చెప్పారు. తాజాగా విడుదలైన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో పలు మార్పులు చేశారు. కొన్ని అంశాలను తొలగించారు. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పుస్తకంలో ‘బాబ్రీ మసీదు’ పేరును ప్రస్తావించలేదు. ‘మూడు గుమ్మటాల నిర్మాణం’ అని మాత్రమే పేర్కొన్నారు. గతంలో అయోధ్యకు సంబంధించిన భాగం నాలుగు పేజీల్లో ఉండేది. దాన్ని ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణం సాధ్యమైందన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య వరకు భాజపా చేపట్టిన రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన మత ఘర్షణలు, భాజపా పాలిత రాష్ట్రాల్లో అధ్యక్ష పాలన, ‘అయోధ్యలో జరిగిన ఘటనలపై భాజపా పశ్చాత్తాపం’ తదితర అంశాలను తొలగించారు. ‘‘రామమందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినపుడు ఆ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకూడదా..? కొత్త పార్లమెంటును నిర్మించాం. ఆ విషయాన్ని మన విద్యార్థులు తెలుసుకోకూడదా..? ప్రాచీన విషయాలతో పాటు.. కొత్తగా జరుగుతున్న పరిణామాలను చేర్చడం మన విధి’’ అని సక్లానీ చెప్పారు. పాఠ్యపుస్తకాలు కాషాయమయం అవుతున్నాయన్న విమర్శలను తిప్పికొట్టారు. ‘‘ఏదైనా అంశం ప్రస్తుత పరిస్థితులకు పనికిరాకపోతే దాన్ని మార్చాలి. ఇందులో కాషాయీకరణను నేను చూడటం లేదు’’ అని చెప్పారు. 2022లో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించకముందు 61 ఏళ్ల సక్లానీ హెచ్‌ఎన్‌బీ గఢ్వాల్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర విభాగం అధిపతిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని