భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి

దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్‌ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది.

Published : 17 Jun 2024 05:40 IST

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌  ప్రదర్శనతో మరింత ప్రాచుర్యం

లఖ్‌నవూ: దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్‌ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది. ఒక మోస్తరుగా జేబులో పట్టేటంత సైజులో ఉండే ఈ పుస్తకాన్ని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పలుచోట్ల పదే పదే ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సైజు రాజ్యాంగ పుస్తకాల ప్రచురణ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో జరుగుతోంది.  నగరంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర గల ‘ఈస్టర్న్‌ బుక్‌ కంపెనీ’ (ఈబీసీ) ప్రచురణకర్తలు గత పదిహేనేళ్లుగా ఈ పాకెట్‌ సైజు రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ వీటిని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లడంతో ‘కోటు పాకెట్‌ ఎడిషను’ రాజ్యాంగ ప్రతులపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ‘ఈబీసీ’ ప్రచురణ సంస్థ డైరెక్టరు సుమీత్‌ మాలిక్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. ఈ సైజు రాజ్యాంగ పుస్తకాల ప్రచురణకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ తమను ప్రోత్సహించినట్లు వెల్లడించారు. ఆయన సూచనతోనే కోర్టుకు వెళ్లే న్యాయవాదుల జేబుల్లో సులువుగా ఇమిడేటంత పరిమాణంలో తాము రాజ్యాంగ  పుస్తకాల ప్రచురణ మొదలుపెట్టినట్లు వివరించారు. 2009లో మొదలుపెట్టి ఇప్పటిదాకా 16 ఎడిషన్లు ప్రచురించినట్లు తెలిపారు. ‘‘ఈ రాజ్యాంగ ప్రతులను ఇప్పటిదాకా ఎక్కువగా న్యాయవాదులు, న్యాయమూర్తులు కొంటూ వచ్చారు. ఇతరులకు కానుకగా ఇచ్చేందుకు కూడా వీరు ఎక్కువగా కొన్నారు. రామనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇదే పుస్తకాన్ని బహూకరించారు’’ అని సుమీత్‌ మాలిక్‌ తెలిపారు. ఈ చిరు పుస్తకంలో అక్షరాల సైజు (ఫాంట్‌) నుంచి కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్యాంగ అధికరణాల సంఖ్యలన్నీ ఎరుపు రంగులో, సమాచారం నల్లరంగులో ఉండేలా పలుచనైన బైబిలు పేపరుపై దీన్ని ప్రచురించారు. ‘‘ఈ చిరు పుస్తకాన్ని మీరు చేతుల్లోకి తీసుకొన్నపుడు 70 ఏళ్ల కిందట రాసిన మన దేశ విధిరాత మీ చేతుల్లో ఉన్నట్లే’’ అని ఈ పాకెట్‌ రాజ్యాంగానికి రాసిన ముందుమాటలో భారత మాజీ అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని