సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి

నీట్‌లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ డిమాండు చేశారు.

Updated : 17 Jun 2024 05:51 IST

నీట్‌ పరీక్ష నిర్వహణపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి
ప్రధాని మౌనం సరికాదు : సిబల్‌

దిల్లీ: నీట్‌లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ డిమాండు చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. నీట్‌ విషయంలో ప్రధానమంత్రి మౌనంగా ఉండటం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది చర్చకు రాకపోవచ్చని, కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వం దీనిని అనుమతించకపోవచ్చన్నారు. ‘‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విధానంలో అవినీతి జరిగిందంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. గుజరాత్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు ఎంతో కలవరపరిచాయి. జాతీయస్థాయిలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాలపై మాట్లాడుతున్న కొందరు.. గత యూపీఏ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) ఆధ్వర్యంలోని డైరెక్టర్లు 2010లోనే నీట్‌ నిబంధనలు రూపొందించారు. ఎంసీఐ అనేది ఆరోగ్యశాఖ పరిధిలోకి రాదు.. విద్యాశాఖ కిందకు వస్తుంది. అందుకే హెచ్‌ఆర్‌డీ మంత్రిగా నాకు దాంతో సంబంధం లేదు’’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. భాజపా హయాంలో.. 2019లో ఐఎంసీఏ 1956 స్థానంలో ఎన్‌ఎంసీఏ చట్టాన్ని ఆమోదించారని, అందులోని సెక్షన్‌ 14లో నీట్‌ ప్రస్తావన ఉందన్నారు. అక్టోబరు 29, 2020లో సుప్రీంకోర్టు కూడా ఈ చట్టాన్ని సమర్థించిన విషయాన్ని గుర్తు చేసిన సిబల్‌.. గత యూపీఏ ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదన్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అధికారులను కాపాడే అవకాశాలు ఉన్నాయని, అందుకే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే స్వతంత్ర దర్యాప్తు బృందం లేదా ప్రభుత్వంతో సంబంధం లేని నిపుణులతో దర్యాప్తు జరిపించాలన్నారు.

ఎన్‌టీఏ సమగ్రతపై సందేహాలు : కాంగ్రెస్‌

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సమగ్రత, నీట్‌ రూపకల్పన, నిర్వహణ విధానంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్‌ పేర్కొంది. నూతన పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటయ్యాక నీట్, ఎన్‌టీఏ, ఎన్‌సీఈఆర్‌టీలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 


నీట్‌ నిర్వహణను నిలిపేయాలి : స్టాలిన్‌

చెన్నై: ప్రతిభావంతుల ఎంపిక పేరుతో నిర్వహిస్తున్న నీట్‌ ఓ కుంభకోణం అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఆదివారం అభివర్ణించారు. విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయం, పేదలకు వ్యతిరేకమైన ఈ జాతీయ పరీక్ష నిర్వహణను కేంద్రం వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. 


ప్రశ్నపత్రాల లీకు వ్యవహారం.. బిహార్‌లో ఆరు చెక్కుల స్వాధీనం

పట్నా: నీట్‌ ప్రశ్నపత్రాలను బహిర్గతం చేసేందుకు మాఫియాకు ఇచ్చినవిగా భావిస్తున్న తదుపరి తేదీ వేసిన (పోస్టు డేటెడ్‌) ఆరు చెక్కులను బిహార్‌ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఈవోయూ) స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు అధికారులు సంబంధిత బ్యాంకుల నుంచి ఖాతాదారుల వివరాలను సేకరిస్తున్నారని ఈవోయూ డీఐజీ వెల్లడించారు. ప్రశ్నపత్రాలను లీకు చేసేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షల చొప్పున సంబంధిత మాఫియా ముఠా డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నీట్‌ పేపర్‌ లీకు కేసుకు సంబంధించి బిహార్‌కే చెందిన 13 మందిని ఈవోయూ అరెస్టు చేసింది. వీరిలో నలుగురు పరీక్షకు హాజరైన సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు