ఎప్పుడూ ఏకగ్రీవం.. మరి ఈసారి..

లోక్‌సభలో స్పీకర్‌ పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఈసారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సభ నిర్వహణలో కీలకమైన సభాపతి పదవిని తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం.

Published : 18 Jun 2024 08:36 IST

లోక్‌సభ స్పీకర్, ఉప సభాపతి ఎన్నికపై ఉత్కంఠ
ఆనవాయితీ పాటించకపోతే పోటీ తప్పదంటున్న విపక్షం

దిల్లీ: లోక్‌సభలో స్పీకర్‌ పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఈసారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సభ నిర్వహణలో కీలకమైన సభాపతి పదవిని తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం విపక్షం డిమాండ్‌ చేస్తోంది. ఈసారి సభలో వాటి బలం పెరగడం దానికి కారణం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ముందుగా నూతన సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెదేపా, జేడీయూ కీలకంగా నిలిచాయి. ఆ రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. గత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంది. ఈసారి దీనిని తమ కూటమికి ఇవ్వకపోతే స్పీకర్‌ పదవి ఏకగ్రీవం కానివ్వకుండా ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని విపక్షాలు భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. సంఖ్యాబలం ప్రకారం అధికార పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఉంటారని జేడీయూ నేత కె.సి.త్యాగి వెల్లడించారు. ‘‘..దీనిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మొదట చర్చ జరుపుతాయి. అందరి ఆమోదం లభించిన తర్వాత మేం అభ్యర్థిని నిలబెడతాం. ఆ వ్యక్తికి కూటమి పార్టీలన్నీ మద్దతిస్తాయి’’ అని తెదేపా పేర్కొంది. 

ఓం బిర్లా.. పురందేశ్వరి.. మహతాబ్‌? 

స్పీకర్‌ పదవి భాజపా వద్దే ఉంటే, ఓం బిర్లాకే మరోసారి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఆయన కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఒడిశాలో బిజద నుంచి భాజపాలో చేరిన భర్తృహరి మహతాబ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరు కాకుండా వేరేవారి పేరు కూడా తెరపైకి రావొచ్చని తెలుస్తోంది.


ఎన్నిక జరిగితే ఇదే మొదటిసారి

విపక్షం పట్టుబిగించడం వల్ల లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగినట్లయితే ఇదే తొలిసారి అవుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం.. 1925 ఆగస్టు 24న అప్పటి ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియార్‌పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్‌ జె పటేల్‌ స్పీకర్‌గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్‌ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్‌ నేత జి.వి.మౌలాంకర్‌.. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు. అప్పటినుంచి ఏకాభిప్రాయంతోనే సభాపతి ఎన్నిక పూర్తవుతూ వస్తోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని