2,500 ఏళ్ల క్రితం భూకంపంతో మారిన గంగానది ప్రవాహం

ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2,500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భారీ భూకంపం కారణంగానే ఇలా జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు.

Published : 18 Jun 2024 04:32 IST

అధ్యయన నివేదిక వెల్లడి

దిల్లీ: ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2,500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భారీ భూకంపం కారణంగానే ఇలా జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం గంగానది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్‌ స్కూల్‌కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త, ఈ అధ్యయన నివేదిక సహ రచయిత మైఖేల్‌ స్టెక్లెర్‌ తెలిపారు. హిమాలయాల్లో ప్రారంభమైన గంగానది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదులను కలుపుకొని బంగాళా ఖాతంలో పలు పాయలుగా కలుస్తున్న విషయం తెలిసింది. 2,500 ఏళ్ల క్రితం గంగానది ప్రధాన ప్రవాహం ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నగరానికి దక్షిణ దిశన సుమారు 100 కి.మీ. దూరంలో ఉండేదని, ఆ నాడు సంభవించిన భారీ భూకంపం తర్వాత నది ప్రస్తుత దిశకు మారిందనే అంచనాకు భూభౌతిక శాస్త్రవేత్తలు వచ్చారు. ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రవేత్తల బృందం జరిపిన వివిధ పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధ్యయన నివేదిక ప్రధాన రచయిత, నెదర్లాండ్స్‌కు చెందిన వాహ్‌నింగెన్‌ విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ ఎల్‌.చాంబర్లేన్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌ ఇప్పటికీ భూకంప ప్రమాద జోన్‌ పరిధిలో ఉన్న విషయం గమనార్హం. ఈ అధ్యయనం వివరాలు ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని