యూపీఎస్సీ ప్రిలిమ్స్‌.. టాప్‌-10లో పఢ్‌ఏఐ యాప్‌!

కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ-2024 పరీక్షలో ఏఐ ఆధారంగా పనిచేసే ‘పఢ్‌ఏఐ’ యాప్‌ 200కుగానూ 170 మార్కులు సాధించింది. మొత్తం పరీక్షను కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తిచేసింది కూడా.

Published : 18 Jun 2024 04:33 IST

దిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ-2024 పరీక్షలో ఏఐ ఆధారంగా పనిచేసే ‘పఢ్‌ఏఐ’ యాప్‌ 200కుగానూ 170 మార్కులు సాధించింది. మొత్తం పరీక్షను కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తిచేసింది కూడా. సాధారణంగా 100 మార్కులు వచ్చినా ప్రిలిమ్స్‌ పరీక్షలో అభ్యర్థులు విజయం సాధించవచ్చు. పఢ్‌ఏఐకు వచ్చిన మార్కులకు నంబర్‌ వన్‌ ర్యాంకు కాకపోయినా, టాప్‌-10లో నిలుస్తుందని దీన్ని రూపొందించిన సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐఐటీ పూర్వ విద్యార్థులు ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఆదివారం ప్రిలిమ్స్‌ ముగిసిన వెంటనే, అదే ప్రశ్నపత్రం ఇచ్చి ఈ యాప్‌చేత పరీక్ష రాయించారు. విద్యావేత్తలు, యూపీఎస్‌సీ వర్గాలు, జర్నలిస్టుల సమక్షంలో నిర్వహించిన ఈ పరీక్షను ఆన్‌లైన్లో లైవ్‌ కూడా ఇచ్చారు. ‘మేం చేసింది  ఈ విభాగంలో మొదటి ప్రయత్నమే కావొచ్చు.. కానీ మున్ముందు విద్యా సంస్థలు పరీక్ష పత్రాల జవాబుల కోసం ఏఐను ఉపయోగించుకోవడం అతి సాధారణ అంశం అవుతుంది’ అని చెబుతారు పఢ్‌ఏఐ సీఈఓ కార్తికేయ మంగళం. యూపీఎస్సీ అభ్యర్థుల కోసం తెచ్చిన పఢ్‌ఏఐలో వార్తాంశాల విశ్లేషణలు, గతంలో వచ్చిన ప్రశ్నలు, సందేహాల నివృత్తి, వివిధ ప్రశ్నలకు జవాబులు వివరించడం.. లాంటి సేవలు అందిస్తున్నట్టు ఆ సంస్థ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని