తక్షణం రాజ్‌భవన్‌ విడిచి వెళ్లండి.. పోలీసులకు బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. రాజ్‌భవన్‌ వద్ద ఉన్న కోల్‌కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రాజ్‌భవన్‌ పరిసరాలు విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు.

Published : 18 Jun 2024 04:34 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. రాజ్‌భవన్‌ వద్ద ఉన్న కోల్‌కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రాజ్‌భవన్‌ పరిసరాలు విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన దాడుల బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన అసెంబ్లీలో విపక్ష(భాజపా) నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల అనంతరం జరిగిన దాడుల బాధితులను(దాదాపు 200 మంది) తీసుకుని ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ ఆనంద బోస్‌ను కలిసేందుకు సువేందు వెళ్లగా.. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీనిపై సువేందు కలకత్తా హైకోర్టుకు వెళ్లగా, అనుమతి ఉంటే గవర్నర్‌ను కలిసేందుకు వారిని రాజ్‌భవన్‌ లోపలకి పంపాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారం తర్వాత పోలీసుల తీరుపై గవర్నర్‌ తీవ్రంగా మండిపడ్డారు. తన ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏ కారణంతో సువేందు, బాధితులు తనను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారో చెప్పాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ కూడా రాశారు. తక్షణమే పోలీసు సిబ్బంది సహా ఇన్‌ఛార్జి అధికారిని రాజ్‌భవన్‌ ప్రాంగణాన్ని విడిచి వెళ్లిపోవాలని సోమవారం గవర్నర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని