ప్రారంభానికి ముందే కూలిన వంతెన!

నిర్మాణం పూర్తిచేసుకుని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంతెన పేకమేడలా కూలిపోయింది. బిహార్‌లోని అరరియా జిల్లా పరరియా గ్రామ పరిధిలో బాక్రా నదిపై నిర్మించిన ఈ వంతెనలో కొంత భాగం మంగళవారం కూలి నదిలో పడింది.

Published : 19 Jun 2024 05:53 IST

బిహార్‌లో ఘటన 

అరరియా(బిహార్‌): నిర్మాణం పూర్తిచేసుకుని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంతెన పేకమేడలా కూలిపోయింది. బిహార్‌లోని అరరియా జిల్లా పరరియా గ్రామ పరిధిలో బాక్రా నదిపై నిర్మించిన ఈ వంతెనలో కొంత భాగం మంగళవారం కూలి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెనకు ఇంకా అనుసంధాన రహదారులు పూర్తికాకపోవడంతో వినియోగంలోకి తీసుకురాలేదు. అరరియా జిల్లాలోని కుర్సా కంటా, సిక్టీ ప్రాంతాలను అనుసంధానించే ఉద్దేశంతో ఈ వంతెనను నిర్మించారు. నదిలో వంతెన ఒక వైపు ఒరిగినట్లు తెలుసుకున్న స్థానికులు కొందరు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారంతా చూస్తుండగానే వంతెన కుప్పకూలింది. ఆ దృశ్యాల్ని వారు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. వంతెన కూలడానికి గల కారణాలు ఇంకా వెల్లడికానప్పటికీ.. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట వంతెన భాగం కూలినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో బిహార్‌లోని కోసీ నదిపైన సుపౌల్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, ఈ ప్రమాదంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఈ వంతెన నిర్మాణం తమ శాఖ చేపట్టలేదని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని