సంక్షిప్త వార్తలు (8)

దిల్లీలో తీవ్రస్థాయి నీటి కొరత కారణంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలవుతోంది. దేశ రాజధాని నగరంలోని ప్రజలకు కూడా అవసరాలకు తగినంత నీటిని సరఫరా చేయలేకపోవడం..  అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠకు మచ్చలాంటిది.

Updated : 19 Jun 2024 06:13 IST

దిల్లీలో నీటి కొరత.. దేశ ప్రతిష్ఠకు మచ్చ!
సూర్యప్రతాప్‌ సింగ్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

దిల్లీలో తీవ్రస్థాయి నీటి కొరత కారణంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలవుతోంది. దేశ రాజధాని నగరంలోని ప్రజలకు కూడా అవసరాలకు తగినంత నీటిని సరఫరా చేయలేకపోవడం..  అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠకు మచ్చలాంటిది. ఈ సమస్యకు కారణం కేంద్ర ప్రభుత్వమా? లేదంటే దిల్లీ సర్కారా? అన్న చర్చను ప్రస్తుతానికి పక్కనపెట్టాలి. నీటి కొరతను అధిగమించే పరిష్కార మార్గాన్ని తక్షణం కనుగొనాలి. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ కూర్చోకూడదు. 


వచ్చే దశాబ్దంలో భారత వృద్ధికి ఇరుసులివే..
- హర్ష్‌ గోయెంకా, ప్రముఖ వ్యాపారవేత్త

రానున్న దశాబ్ద కాలంలో భారత వృద్ధికి ప్రధానంగా ఆరు అంశాలు ఇరుసులుగా పనిచేయనున్నాయి. అవి- 1. మారుమూల ప్రాంతాల్లో ఉండి పనిచేయడం 2. సరఫరా గొలుసు విస్తృతీకరణ 3. మౌలిక వసతుల మెరుగుదల 4. పెట్టుబడుల పెరుగుదలకు అనుకూలతలు 5. స్థూల ఆర్థిక ఆరోగ్యం 6. బలమైన అంతర్జాతీయ సంబంధాలు. వీటి తోడ్పాటుతో మన దేశం ఏటా 7-8% వార్షిక వృద్ధిని సాధించొచ్చు. 2030 కల్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చు. 


రైల్వేకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఏమైనట్టు..? 
- ప్రియాంకా చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు

గత దశాబ్ద కాలంలో రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించింది. అయినప్పటికీ కవచ్‌ సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. రైళ్ల ఆధునికీకరణ జరగలేదు. ప్రయాణికులకు వసతులు మెరుగుపడలేదు. మరి బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ ఏమైనట్టు? అందులో గణనీయమైన వాటా ఎటు పోయిందో తెలుసా..? రైల్వే మంత్రి ప్రచార ఆర్భాటానికి.. ప్రధాని మోదీ వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తూ పచ్చజెండా ఊపే కార్యక్రమాలకు.. రైల్వేస్టేషన్ల వద్ద మోదీ ఏర్పాటుచేయించిన సెల్ఫీ పాయింట్లకు! 


మహిళలకు సమాన హక్కులు దక్కాలంటే మరో 300 ఏళ్లు!
- ఐక్యరాజ్య సమితి

ప్రస్తుత ప్రగతి రేటును బట్టి చూస్తే.. పురుషులతో సమానంగా మహిళలు, అమ్మాయిలకు హక్కులు దక్కేందుకు మరో 300 ఏళ్లు పట్టే అవకాశముంది. అతివలు పూర్తి గౌరవ మర్యాదలతో జీవించాలంటే లింగ సమానత్వం అత్యావశ్యకం. హింసకు గురైనవారికి చేయూతనందించడం, స్త్రీల నిర్ణయాలను గౌరవించడం, వివక్షకు తావు లేకుండా చూడటం వంటి చర్యలు అందుకు దోహదపడతాయి. 


156 పోరాట హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రతిపాదనల ఆహ్వానం  

దిల్లీ: ప్రభుత్వ రంగ ఏరోస్పేస్‌ దిగ్గజం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి 156 ‘ప్రచండ్‌’ తేలికపాటి పోరాట హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.45వేల కోట్లు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రతిపాదనలను ఆహ్వానించడం (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌-ఆర్‌ఎఫ్‌పీ) అంటే ప్రాథమిక స్థాయి టెండర్లను పిలవడంతో సమానం. ఈ హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) గత ఏడాది నవంబరులో పచ్చజెండా ఊపింది. తాజాగా సమీకరించే 156 హెలికాప్టర్లలో 90 లోహవిహంగాలను సైన్యానికి అందిస్తారు. మిగతావి వాయుసేనకు దక్కుతాయి. ఒక్కో హెలికాప్టర్‌ బరువు 5.8 టన్నులు. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. అనేకరకాల ఆయుధాలను ఈ హెలికాప్టర్‌ మోసుకెళ్లగలదు. శత్రువుల యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు వంటివాటిని ఇది ధ్వంసం చేయగలదు.


గ్రామాల్లోని 77% ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం

దిల్లీ: దేశంలోని గ్రామాల్లో ఉన్న 77% ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్లు అందించినట్లు జల్‌ జీవన్‌ మిషన్‌ అధికారిక లెక్కలు వెల్లడించాయి. దేశంలోని మొత్తం గ్రామాల్లో 19.31 కోట్ల ఇళ్లు ఉన్నాయని, వాటిలో 14.88 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించామని సంస్థ పేర్కొంది. నివేదిక ప్రకారం.. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాల్లో ఈ సదుపాయం 100శాతం ఉంది. మరో 16 రాష్ట్రాల్లో 75-100శాతం, ఐదు రాష్ట్రాల్లో 50-75శాతం నల్లా నీటి సౌకర్యం ఉంది. రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఇది 50శాతం కన్నా తక్కువ. 2024 కల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో 2019లో జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించారు.


సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌
జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహణ

దిల్లీ: పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసుల్ని స్నేహాపూర్వకంగా పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహించనుంది. సుప్రీంకోర్టును స్థాపించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని న్యాయవ్యవస్థలో లోక్‌ అదాలత్‌లు అంతర్భాగమని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఆస్తి, భూమి, వివాహ వివాదాలతోపాటు, వాహన ప్రమాదాలు, పరిహారం వంటి కొన్ని కేసులను ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చునని వెల్లడించింది.


సిక్కింలో ముమ్మరంగా సహాయక చర్యలు
- బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సిబ్బంది  

గ్యాంగ్‌టక్‌: భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు చర్యలు వేగవంతమయ్యాయి. సోమ, మంగళవారాల్లో మొత్తం 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ నెల 12న కొండచరియలు విరిగిపడటంతో దారులు దెబ్బతిని విదేశీ పర్యాటకులతో సహా దాదాపు 1200 మంది చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌వో), వాలంటీర్లు కలిసి తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసి బాధితులను వాహనాల్లో తొలుత మంగన్‌కు.. అక్కడి నుంచి గ్యాంగ్‌టక్‌కు తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా మిగతావారినీ కాపాడి, స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని